బీసీ రిజర్వేషన్ల కోసం కృషి : మంత్రి సీతక్క

 బీసీ రిజర్వేషన్ల కోసం కృషి : మంత్రి సీతక్క
  • సోషల్​ మీడియాను అడ్డంపెట్టుకొని కేటీఆర్ అబద్దాల ప్రచారం
  • కామారెడ్డి సభకు పెద్ద ఎత్తున తరలిరావాలి
  • మంత్రి సీతక్క

కామారెడ్డి, వెలుగు :  బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ర్ట ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు.  గురువారం  కామారెడ్డి జిల్లా  భిక్కనూరు, దోమకొండ, బీబీపేట మండల కేంద్రాల్లో జరిగిన కాంగ్రెస్ సమావేశాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. రిజన్వేషన్​ బిల్లుకు రాష్ర్ట ప్రభుత్వం ఆమోదించి పంపినప్పటికీ  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ నెల 15న కామారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించే భారీ సభ విజయవంతం కోసం మండలాల్లో విస్తృత స్థాయి మీటింగ్​లు నిర్వహించినట్లు తెలిపారు.  కుల గణనలో బీజేపీ, బీఆర్​ఎస్​ నాయకులు పాల్గొనలేదన్నారు.  సోషల్ ఇంజినీరింగ్​, సోషల్ జస్టీస్​ జరగాలన్నదే తమ ఉద్దేశమన్నారు.

 ఇందుకోసమే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కల్పించేందుకు రాష్ర్ట ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. కేటీఆర్​ సోషల్​ మీడియాను అడ్డం పెట్టుకొని  అబద్దాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.  తాము కులగణన చేపడితే బీఆర్​ఎస్​, బీజేపీ నాయకులు పాల్గొనలేదన్నారు. బీఆర్​ఎస్​ 10 ఏండ్లు అధికారంలో ఉండి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి వారి సొంతింటి కలను ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. 

మహిళలను కోటీశ్వరులను చేసే  ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. మహిళా సంఘాలకు  క్యాంటీన్లు, బస్సులు,  పెట్రోల్​ బంక్​లు వంటివి ఏర్పాటు చేయిస్తున్నామన్నారు. బీజేపీ, బీఆర్​ఎస్ లు కార్పొరేట్​ సంస్థల కోసం పని చేస్తే  కాంగ్రెస్ పేదల కోసం పని చేస్తుందన్నారు. నాడు స్వాతంతం కోసం, నేడు ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్​ పోరాడుతుందన్నారు. దేవుడు గుడిలో ఉండాలి,  భక్తి గుండెల్లో ఉండాలని, కుల, మతాల పేరుతో బీజేపీ ప్రజలను రెచ్చగొడుతోందని మంత్రి విమర్శించారు.  యూరియా అందించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదన్నారు. ఈ నెల 15న కామారెడ్డిలో నిర్వహించే సభ కనివిని ఎరుగని రీతిలో నిర్వహిస్తామన్నారు.  

అణగారిన వర్గాల కోసం పోరాటం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ 

అణగారిన వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ పేర్కొన్నారు.  ఈ పోరాటానికి ప్రజలు మద్దతు ఇవ్వాలన్నారు. కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి పంపామని,  దీని ఆమోదం కోసం ఢిల్లీలో ధర్నా చేశామన్నారు. జిల్లా లైబ్రరీ చైర్మన్ మద్ది చంద్రకాంత్​రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్​ కైలాస్ శ్రీనివాస్​రావు, పీసీసీ జనరల్ సెక్రటరీ బద్దం ఇంద్రకరణ్​రెడ్డి,  పార్టీ మండల శాఖ ప్రెసిడెంట్లు భీమ్​రెడ్డి, సుతారి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.