
- డబుల్ ఇండ్ల లబ్ధిదారుల..ఎంపిక స్లో?
- ఇంకా పూర్తి కాని సోషల్ ఎకనామిక్ సర్వే
- బల్దియాకు అందినదరఖాస్తులు 7 లక్షలు
- తొలిదశ ఎంపికలో3.5 లక్షలు రిజెక్ట్
- మరోసారి సర్వే చేస్తున్నరెవెన్యూ శాఖ
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో లబ్ధిదారుల ఎంపిక స్లోగా నడుస్తోంది. 40 రోజుల కింద సీఎం కేసీఆర్ కొల్లూరులో డబుల్ బెడ్రూం ఇండ్లను అట్టహాసంగా ప్రారంభించారు. అప్పుడు వచ్చే ఆగస్టు ఫస్ట్ వీక్‌లో పంపిణీ చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. బుధవారం ఎల్బీనగర్లో 118 జీవో పట్టాల పంపిణీ సందర్భంగా అక్టోబర్‌లోగా డబుల్ ఇండ్లు పంపిణీ చేస్తామని మరోసారి కేటీఆర్ హామీ ఇచ్చారు. కానీ.. లబ్ధిదారులు ఎంపిక మాత్రం ఇంకా పూర్తికాలేదు. ఇప్పటికే బల్దియా ఓ దఫా ఎంపిక ప్రక్రియ కంప్లీట్ చేసింది. ఇప్పుడు మళ్లీ రెవెన్యూ శాఖ సోషల్ ఎకనామిక్ సర్వే చేస్తుంది. ప్రతి దరఖాస్తుదారుడి వద్దకు వెళ్లి ఫిజికల్‌గా సంబంధిత పత్రాలు సేకరించి అర్హులను గుర్తిస్తుంది.
కొల్లూరులో ప్రారంభించినా..
గ్రేటర్ హైదరాబాద్‌లోని111 ప్రాంతాల్లో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను బల్దియా చేపట్టింది. ఇందులో 43 మురికివాడల్లో 9,828, 68 ఖాళీ స్థలాల్లో 90,172 వేల నిర్మాణాలు కొనసాగించింది. ఇందులో 65 వేల ఇండ్ల పనులు పూర్తయ్యాయి. వీటిలో 24 ప్రాంతాల్లోని 4,500 ఇండ్లను లబ్ధిదారులకు అందించారు. అవి మురికివాడల్లో లబ్ధిదారుల స్థలాల్లోనే నిర్మించి అందించారు. ఇండ్లు లేని నిరుపేదలకు ఇంకా పంపిణీ చేయడంలేదు. కొల్లూరులో 15,660 ఇండ్లను నిర్మించగా.. నిరుపేదలకు ఇక్కడే ఇస్తామని ప్రతి మీటింగ్‌లోనూ మంత్రులు హామీ ఇచ్చారు. వీటి నిర్మాణం కూడా గతేడాదే పూర్తయింది. గ్రేటర్లోకి వచ్చే హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని అర్హులకే ఇండ్లను పంపిణీ చేయాల్సి ఉంటుంది. కొల్లూరులో ప్రారంభించిన ఇండ్లలో సీఎం కేసీఆర్ ఆరుగురు లబ్ధిదారులకే పట్టాలను అందించారు. మిగతా వాటిని నేటికీ పంపిణీ చేయలేదు.
బల్దియా సర్వే చేసినా..
గ్రేటర్లో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మిస్తామని సర్కారు 90వేల మాత్రమే చేస్తుంది. వీటికి 7,09,718 అప్లికేషన్లు వచ్చాయి. 2017 నుంచి 2019 వరకు అప్లై చేసిన వారి ఇండ్లకు బల్దియా సిబ్బంది వెరిఫికేషన్ కు వెళ్లగా కొందరు అందుబాటులో లేరు. వారి ఫోన్ నెంబర్లు కూడా కలవలేదు. వివిధ కారణాలతో ఆ దరఖాస్తుదారులను పక్కన పెట్టింది. ఇలా 3,54,756 అప్లికేషన్లను రిజెక్ట్ చేశారు. 3,54,962 సరైనవిగా గుర్తించారు. ఆ వివరాలనే రెవెన్యూశాఖకు పంపింది. అయితే.. జూన్ లోనే బల్దియా, రెవెన్యూ శాఖ జాయింట్ సర్వేకు నిర్ణయించుకోగా కో ఆర్డినేషన్ లేక ముందుకుపడలేదు. బల్దియా సిబ్బంది ఎన్నికల బిజీలో ఉండగా.. ఇప్పుడు రెవెన్యూశాఖ ఫైనల్ సర్వే చేస్తుంది. దరఖాస్తుదారుల వద్దకు వెళ్లి ఓటర్ కార్డు నెంబర్, నియోజకవర్గం, కులం, మతం, ఫోన్ నెంబర్, ప్రస్తుత అడ్రస్ తో పాటు తదితర వివరాలు సేకరిస్తుంది. ఇది పూర్తయ్యాక అర్హులైన లబ్ధిదారుల జాబితాను ప్రకటించనుంది. ఆ తర్వాత డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేయనుంది. ఇప్పుడున్న ఇండ్లు వీరికి కూడా సరిపోవు. రెవెన్యూ శాఖ సర్వే తర్వాత ఎవరికి ఇండ్లు వస్తాయనేందుకు వేచి చూడాల్సిందే.
సర్కార్ ఏం చెబుతుందో..
గ్రేటర్లో నిర్మించిన 90 వేల ఇండ్లకు ఒక్కో ఇంటికి 7 మంది చొప్పున పోటీ ఉంది. 90వేల మందికి మాత్రమే ఇండ్లు అందుతాయి. వచ్చిన అప్లికేషన్లలో ఏదో ఒక సాకు చూపుతూ ఇప్పటికే సగం రిజెక్ట్ చేశారు. మిగిలిన మూడున్నర లక్షల మందిలో కూడా అర్హులను గుర్తించి, మిగతావారికి వచ్చే రోజుల్లో ఇస్తామని హామీ ఇవ్వనున్నట్లు కనిపిస్తుంది. ఏండ్లుగా ఇండ్ల కోసం ఎదురుచూస్తున్న వారికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల లోపు అయితే పంపిణీ చేసే అవకాశం లేదు. మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే అందరికీ ఇండ్లు ఇస్తామనే ప్రచారం జోరుగా చేసుకోనున్నట్లు తెలుస్తోంది.