మర్కజ్‌ ఘటన లేకపోతే ఆ ఒక్క కేసు కూడా ఉండేది కాదు

మర్కజ్‌ ఘటన లేకపోతే ఆ ఒక్క కేసు కూడా ఉండేది కాదు

కరోనా వైరస్‌ నివారణకు స్వీయ నియంత్రణే మందు అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాబోయే రెండు వారాలు ఎంతో కీలకమ‌ని, కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని మంత్రి కేటీఆర్‌ ప్రజలను కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బుధ‌వారం మంత్రి ఆకస్మికంగా పర్యటించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. క‌రోనా ప్ర‌బ‌లితే ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. అగ్రరాజ్యమైన అమెరికా కూడా కరోనా వైరస్ ను తట్టుకోలేకపోయిందని.. అక్క‌డ‌ శవాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయని చెప్పిన కేటీఆర్.. తెలంగాణ రాష్ట్రం మాత్రం ప‌రిస్థితి అదుపులో ఉందని చెప్పారు.

జిల్లా యంత్రాంగం కరోనా సోకకుండా అప్రత్తమైంద‌ని, జిల్లాలో ఒకే ఒక్క పాజిటివ్ కేసు నమోదైందని మంత్రి చెప్పారు. మర్కజ్‌ ఘటన లేకపోతే జిల్లాల్లో ఆ ఒక్క కేసు కూడా ఉండేది కాదన్నారు. మళ్లీ కొత్త కేసు నమోదు కాకుండా అంద‌రూ స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. మరో రెండు వారాలు కూడా ప్రజలు ఇలాగే సహకరించి త్వరలో తెలంగాణను కరోనా రహిత రాష్ట్రంగా ప్రకటించుకుందామ‌ని మంత్రి అన్నారు.