ఓయూ స్టూడెంట్లను పల్లీ.. బటానీ అంటావా..!

ఓయూ స్టూడెంట్లను పల్లీ.. బటానీ అంటావా..!
  • కేటీఆర్​కు చెప్పులతో బుద్ది చెప్పాలె..
  • కాంగ్రెస్​ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్​ మల్లన్న

నర్సంపేట/తొర్రూరు, వెలుగు : ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్లను పల్లీ.. బటానీలు అమ్మేవారని కామెంట్​ చేసిన కేటీఆర్​కు స్టూడెంట్లు చెప్పులతో బుద్ది చెప్పాలని కాంగ్రెస్​ వరంగల్​–నల్గొండ –ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్​ మల్లన్న పిలుపునిచ్చారు. వరంగల్​ జిల్లా నర్సంపేట టౌన్​లోని పద్మశాలీ గార్డెన్​లో కాంగ్రెస్​ ఆధ్వర్యంలో గురువారం గ్రాడ్యుయేట్స్​ఆత్మీయ సమ్మేళనం జరిగింది.

 ఇందులో పాల్గొన్న తీన్మార్​మల్లన్న మాట్లాడుతూ నర్సంపేటలో కేటీఆర్​చిల్లర కామెంట్లు చేశారని, ఓయూ విద్యార్థులు ఉద్యమం చేస్తే అధికారం అనుభవించి ఇప్పుడు పనికి రాని మాటలు మాట్లాడుతున్నారన్నారు. బీఆర్ఎస్​ కు రాబోయే రోజుల్లో పిండం పెట్టడం ఖాయమని, ఒకవేళ పిండం పెట్టినా కాకులు కూడా ముట్టవన్నారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మహబూబాబాద్ ​ఎంపీ అభ్యర్థి పోరిక బలరాంనాయక్​, మాజీ మార్కెట్​కమిటీ చైర్మన్​పాలాయి శ్రీనివాస్​ పాల్గొన్నారు.

 మహబూబాబాద్ ​జిల్లా తొర్రూరులోని రామ ఉపేందర్​గార్డెన్స్​లో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలోనూ మల్లన్న మాట్లాడారు. పదేండ్లుగా ప్రజల కోసం పోరాడుతున్న తనపై కేసీఆర్​100 అక్రమ కేసులు పెట్టి  జైల్లో పెట్టించారని, ఇప్పుడు ఆయన బిడ్డ కవితకూ అదే గతి పట్టిందన్నారు. ఆరెకరాల భూమి ఉన్న కేటీఆర్​కు ఇప్పుడు 600 ఎకరాలు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. 

కేటీఆర్​20 యూట్యూబ్​ఛానల్స్​పెట్టి తనను బద్నాం చేయాలని చూస్తున్నాడని, ఆయన మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే 2 లక్షల ఉద్యోగాలు గురుకుల టీచర్ల నియామకంతో పాటు, ప్రైవేటు టీచర్లు, ఉద్యోగులకు, 1990 డీఎస్సీ బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.