ఒడిశాలోఈగల్ టీం హై రిస్క్ ఆపరేషన్..అడవిలో 80 కిలోమీటర్లు ఛేజింగ్..500 కేజీల గంజాయి పట్టివేత

ఒడిశాలోఈగల్ టీం హై రిస్క్ ఆపరేషన్..అడవిలో 80 కిలోమీటర్లు ఛేజింగ్..500 కేజీల గంజాయి పట్టివేత

తెలంగాణలోకి గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది ఈగల్ ఫోర్స్. సినిమా సీన్‌ను తలపించేలా.. ప్రాణాలకు తెగించి ఒక భారీ హై-రిస్క్ ఆపరేషన్‌ను  చేసింది.

ఒడిశాలోని బలిమేళా నుంచి జయపూర్ వరకు.. దట్టమైన అడవుల గుండా ఏకంగా 80 కిలోమీటర్ల మేర గంజాయి రవాణా చేస్తున్న బొలెరో వాహనాన్ని ఈగల్ ఫోర్స్ వేటాడింది. చివరకు అటవీ ప్రాంతంలో వాహనాన్ని వదిలేసి డ్రైవర్ పరార్ కాగా.. వాహనాన్ని ఈగల్ ఫోర్స్ స్వాధీనం చేసుకుంది.

ఈ తనిఖీల్లో 115 ప్యాకెట్లలో ప్యాక్ చేసి ఉన్న సుమారు 500 కిలోల భారీ గంజాయి నిల్వలు బయటపడ్డాయి. ఇందులో 5 కిలోల బరువున్నవి 90 ప్యాకెట్లు .. 2 కిలోల బరువున్నవి మరో 25 ప్యాకెట్లు ఉన్నాయి. పట్టుబడిన గంజాయితో పాటు బొలెరో వాహనాన్ని ఒడిశాలోని కొరాపుట్ పోలీసులకు అప్పగించారు. ఈ వాహనం ఒడిశా నబరంగ్‌పూర్ జిల్లాకు చెందిన అమీర్ అలీ ఖాన్ పేరుతో రిజిస్టర్ అయి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు NDPS చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

గతంలో 2024లో కూడా ఇలాగే రాంచీ వరకు వెంబడించి 500 కిలోల గంజాయిని పట్టుకున్న రికార్డు ఈగల్ ఫోర్స్‌కు ఉంది. ప్రాణాలను పణంగా పెట్టి ఈగల్ ఫోర్స్ నిర్వహించిన ఈ మెగా ఆపరేషన్‌పై ఒడిశా పోలీసులు  ప్రశంసించారు.