బీజేపీ నేత కైలాష్ విజయవర్గీయ వివాదాస్పద వ్యాఖ్యలు

బీజేపీ నేత కైలాష్ విజయవర్గీయ వివాదాస్పద వ్యాఖ్యలు

బీజేపీ సీనియర్ నాయకుడు కైలాష్ విజయవర్గీయ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిల వస్రధారణపై కామెంట్స్ చేశారు. అమ్మాయిలు మంచి దుస్తులు ధరించాలని, లేకపోతే వారంతా శూర్పణఖలా కనిపిస్తారని అన్నారు. చెడు వ్యసనాలకు బానిసలైన యువతను చూస్తుంటే చెంప చెల్లుమనిపించాలని అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. ఆడపిల్లల దుస్తులపై కైలాష్ విజయవర్గియా చేసిన వ్యాఖ్యలు దుమారం రేగుతోంది. హనుమాన్ జయంతి సందర్భంగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జైన సమాజ్ నిర్వహించిన కార్యక్రమంలో కైలాష్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

 కైలాష్ విజయవర్గీయ ఏమన్నారంటే...

‘‘మేము మహిళలను దేవతలు అని పిలుస్తాము. అయితే... వారు మంచి దుస్తులు ధరించనప్పుడు వారిలో దేవతల రూపాన్ని చూడలేం. దానిక బదులు వారు శూర్పణఖగా కనిపిస్తారు.’’ అని వ్యాఖ్యానించారు. దీంతో పాటు ఆయన మత్తుకు బానిసలైన యువకులను ఉద్దేశించి కూడా మాట్లాడారు. అలాంటి వారి చెంప చెల్లుమనిపించాలని తనకు అనిపిస్తుందని అన్నారు. ఎంతో మంది యువకులు మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు.