న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ 18వ స్పీకర్‌గా బీజేపీ సీనియర్ నేత ప్రేమ్ కుమార్ ఎన్నికయ్యారు. స్పీకర్ ఎన్నికకు ప్రేమ్ కుమార్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా ఆయనకు మద్దతు పలికారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి పొత్తులో భాగంగా స్పీకర్ పదవికి బీజేపీకి దక్కింది.
విజయ్ కుమార్ సిన్హా, నందకిషోర్ యాదవ్ తర్వాత బీజేపీ కోటా నుంచి స్పీకర్ పదవి చేపట్టిన మూడో వ్యక్తిగా ప్రేమ్ కుమార్ నిలిచారు. స్పీకర్‌గా ఎన్నికైన ప్రేమ్ కుమార్‌కు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అభినందనలు తెలిపారు. ప్రేమ్ కుమార్‌ని మొత్తం సభ తరపున అభినందిస్తున్నాను. ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉంది. సభ నిర్వహణలో పూర్తిగా సహకరిస్తారని అన్నారు.
బీహార్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ కూడా స్పీకర్‌గా ఎన్నికైన ప్రేమ్ కుమార్‌కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షం ప్రభుత్వానికి అద్దంలా పనిచేస్తుందని మీకు బాగా తెలుసు. ఎందుకంటే ప్రభుత్వానికి ఎప్పుడూ సొంత లోపాలు కనిపించకపోవచ్చు. అందువల్ల మీరు పాలకపక్షం కంటే మమ్మల్ని ఎక్కువగా కలుపుకోవాలని ఆశిస్తున్నామని స్పీకర్‌ను కోరారు.
ప్రేమ్ కుమార్ రాజకీయ జీవితం:
70 ఏళ్ల ప్రేమ్ కుమార్ బీహార్ బీజేపీలో అత్యంత సీనియర్ నాయకులలో ఒకరు. ఆయన అత్యంత వెనుకబడిన కులాల (ఇబిసి) వర్గానికి నేత. ఆయన వరుసగా తొమ్మిదవసారి గయా టౌన్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి అఖౌరీ ఓంకార్ నాథ్‌ను 26,423 ఓట్ల తేడాతో ఓడించారు.
ప్రేమ్ కుమార్ గతంలో పర్యావరణ మంత్రి, సహకార మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. గతంలో నితీష్ కుమార్ మహాఘట్బంధన్ ప్రభుత్వానికి అధిపతిగాఉండగా.. ఆ సమయంలో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ప్రేమ్ కుమార్ పని చేశారు.
