చట్టాలను ఉపయోగించుకుని రక్షణ పొందాలి : ఎ.నాగరాజ్

చట్టాలను ఉపయోగించుకుని రక్షణ పొందాలి : ఎ.నాగరాజ్

భూపాలపల్లిరూరల్, వెలుగు: మహిళలు చట్టాలను ఉపయోగించుకొని ఎదగాలని, రక్షణ పొందాలని సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.నాగరాజ్  అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ, ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల, సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం మహిళా సాధికారత పై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి చీఫ్​గెస్ట్​గా హాజరైన జడ్జి నాగరాజు మాట్లాడుతూ మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించి తమ కుటుంబాలను చక్కగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. 

అనంతరం సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 9 రోజుల శిక్షణ కార్యక్రమం పూర్తిచేసిన 15 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషిన్, శిక్షణ సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.ఆర్.దిలీప్ కుమార్ నాయక్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జి.అఖిల, కళాశాల ప్రిన్సిపాల్ రమణారావు, సర్వోదయ సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ కవి రాజ్ తదితరులు పాల్గొన్నారు.