బీఆర్ఎస్‌‌లోకి నాగం జనార్థన్రెడ్డి

బీఆర్ఎస్‌‌లోకి నాగం జనార్థన్రెడ్డి
  • కాంగ్రెస్​కు రాజీనామా చేస్తూ ఖర్గేకు లేఖ
  • ఇంటికి వెళ్లి ఆహ్వానించిన మంత్రులు కేటీఆర్, హరీష్ రావు 
  • నాగర్​ కర్నూల్​ అభివృద్ధి కోసమే బీఆర్ఎస్‌‌లో చేరుతున్నట్లు ప్రకటన

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత నాగం జనార్దన్​రెడ్డి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌‌లో తనకు అవమానం జరిగిందని, పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఎంతో బాధ కలిగించాయని చెప్పారు. బీఆర్ఎస్‌‌లో చేరుతానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో నాగం జనార్దన్​రెడ్డి ఇంటికి మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఆదివారం సాయంత్రం వెళ్లారు. బీఆర్ఎస్‌‌లోకి రావాలని మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. వారి ఆహ్వానానికి నాగం సానుకూలంగా స్పందించారు. తర్వాత కేటీఆర్, హరీశ్‌‌తో కలిసి మీడియాతో నాగం మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్​పార్టీ పరిస్థితి రోజు రోజుకు అధ్వానంగా మారుతున్నదని అన్నారు. చేవెళ్లలో నిర్వహించిన దళితుల ఆత్మగౌరవ సభకు 50 వేల మందిని తరలించామని, కానీ పొద్దున పార్టీలో జాయిన్​అయిన వారికి సాయంత్రం టికెట్​ఇచ్చారని మండిపడ్డారు.

‘‘ఉదయ్​పూర్​డిక్లరేషన్​ను తుంగలో తొక్కారు. తనకు టికెట్​ఎందుకు ఇవ్వలేదని రేవంత్​రెడ్డిని అడిగాను. సునీల్​కనుగోలు టీమ్ సర్వేల ఆధారంగా టికెట్​ఇచ్చామని చెప్తున్నాడు. మొదటి నుంచి జెండా మోసినవాళ్లు, పార్టీ కోసం పని చేసిన వాళ్లకు కాకుండా డబ్బులున్నోళ్లకే టికెట్లు ఇస్తున్నారు. అందుకే కాంగ్రెస్​కు రాజీనామా చేసి కార్యకర్తల ముందుకు వచ్చాను. నాగర్​కర్నూల్​అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ లో చేరుతున్నా. మర్రి జనార్దన్​రెడ్డి గెలుపు కోసం అందరం కలిసి పని చేద్దాం” అని చెప్పారు. కేటీఆర్ మాట్లాడుతూ.. నాగం జనార్దన్​రెడ్డి నిఖార్సయిన తెలంగాణవాది అని, ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన జైలుకు కూడా వెళ్లారని తెలిపారు.

కేసీఆర్​కు అత్యంత సన్నిహితుడైన ఆయనను పార్టీలోకి ఆహ్వానించామని తెలిపారు. ఆయనను నమ్ముకున్న నాయకులకు బీఆర్ఎస్​లో సముచిత హోదా, గౌరవం కల్పిస్తామని తెలిపారు. రేపు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి కట్టుగా పని చేద్దామని కోరామని, అందుకు నాగం సానుకూలంగా స్పందించారని తెలిపారు.

కాంగ్రెస్‌‌లో ఇమడలేను: ఖర్గేకి నాగం రాజీనామా లేఖ

తన రాజీనామా లేఖను మల్లికార్జున ఖర్గేకి నాగం పంపించారు. రాష్ట్ర ప్రజలకు ఆత్మగౌరవంతో సేవ చేసేందుకే పార్టీని వీడుతున్నానని స్పష్టం చేశారు. దశాబ్దాలపాటు విలువలతో కూడిన రాజకీయాలను చేశానని, ఇక కాంగ్రెస్​లో ఇమడలేనని తేల్చి చెప్పారు. పార్టీ అధిష్ఠానం తన శ్రమను గుర్తించలేదన్నారు. తనకు టికెట్ ఇవ్వకపోవడం బాధించిందని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కొడుకు రాజేశ్ రెడ్డికి టికెట్ ఎట్లా ఇచ్చారని ప్రశ్నించారు.

నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఆయన ఏనాడూ పనిచేసింది లేదని, తనను సంప్రదించకుండానే టికెట్ ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. తెలంగాణను ఇచ్చిన సోనియా గాంధీకి జీవితాంతం రుణపడి ఉంటానని పేర్కొన్నారు.