నాపై ఇచ్చినట్లు కిషన్‌‌రెడ్డిపై తప్పుడు రిపోర్టులు ఇవ్వొద్దు: బండి సంజయ్

నాపై ఇచ్చినట్లు కిషన్‌‌రెడ్డిపై తప్పుడు రిపోర్టులు ఇవ్వొద్దు: బండి సంజయ్
  • సమిష్టిగా ముందుకు సాగుదాం.. పార్టీని అధికారంలోకి తెద్దాం: కిషన్​రెడ్డి
  • నాపై ఇచ్చినట్లు కిషన్‌‌రెడ్డిపై తప్పుడు రిపోర్టులు ఇవ్వొద్దు: బండి సంజయ్
  • సంజయ్‌‌ని చూస్తుంటే కండ్లలో నీళ్లు తిరిగినయ్: రాజగోపాల్‌‌రెడ్డి
  • కవితను అరెస్ట్ చేస్తరా?.. నిర్దోషిగా ప్రకటిస్తరా?.. తేల్చండి: రవీంద్ర నాయక్
  • కిషన్ రెడ్డి సారథ్యంలో పవర్‌‌‌‌లోకి వస్తం: ధర్మపురి అర్వింద్
  • బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుతాం: ఈటల రాజేందర్
  • కేసీఆర్ అహంకారానికి చరమ గీతం పాడాలి: రఘునందన్ రావు

హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ స్టేట్ ఆఫీసులో జరిగిన సభలో సీనియర్ నేతలు తమ మనసులోని మాటలను బయటపెట్టారు. పార్టీని ఎట్ల ముందుకు తీసుకుపోవాలి? ఇప్పటివరకు జరిగిన పరిణామాలు ఏమిటి? బీఆర్ఎస్‌‌ను ఎదుర్కోవాలంటే ఏం చేయాలనే దానిపై అభిప్రాయాలను వెల్లడించారు. కొందరు ఎమోషనల్ అయ్యారు. నేతల ఓపెన్ టాక్‌‌కు ఈ సభ వేదిక అయ్యింది. కిషన్‌‌రెడ్డి మాట్లాడుతూ.. అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దామని, పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువద్దామని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇకనైనా లేనిపోని ఫిర్యాదులు చేయడం మానుకోవాలని, తప్పుడు రిపోర్టులు బంద్ చేసి, కిషన్ రెడ్డినైనా ప్రశాంతంగా పనిచేయనివ్వాలని బండి సంజయ్ కోరారు. నమ్ముకుని వచ్చిన నాయకులను, నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్తల ఆశలను వమ్ము చేయవద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో బీజేపీకి జోష్ వచ్చిందంటే కారణం బండి సంజయేనని, పార్టీ కోసం కష్టపడ్డ ఆయన్ను గుండెల్లో పెట్టుకోవాలని కోమటిరెడ్డి రాజగోపాల్‌‌రెడ్డి అన్నారు.

జన ప్రభంజనం రాబోతున్నది: కిషన్‌‌రెడ్డి

తెలంగాణలో జన ప్రభంజనం రాబోతున్నదని, ఇందులో బీఆర్ఎస్, కాంగ్రెస్ కొట్టుకుపోవడం ఖాయమని కిషన్‌‌రెడ్డి అన్నారు. అమరవీరుల ఆకాంక్షలను ప్రతిబింబించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే బీజేపీ లక్ష్యమని తెలిపారు. ‘‘యుద్ధం మొదలైంది కేసీఆర్.. అధికారం, డబ్బు, పోలీసులు ఉన్నారని​అనుకుంటున్నావేమో.. మీకు, మీ కుటుంబానికి మేం బానిసలం కాదు. రజాకార్లను తరిమి కొట్టిన చరిత్ర ఈ తెలంగాణది. ఆ విషయం మరిచిపోకు” అని హెచ్చరించారు. 

రూ.వేల కోట్లను దోపిడీ చేస్తే ఎవరూ మాట్లాడొద్దా? అని కిషన్​ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ సర్కార్‌‌ను అబిడ్స్ చౌరస్తాలో పాతరేసే వరకు నిద్రపోయేది లేదని నిప్పులు చెరిగారు. కేసీఆర్ పర్మినెంట్‌గా ఫామ్‌హౌస్‌లోనే రెస్టు తీసు కునే పరిస్థితిని కల్పిస్తామన్నారు. ‘‘అవినీతికి రారాజు కేసీఆర్. దేశంలో ఏ రాజకీయ పార్టీ ఇంత అవినీతి చేయలేదు. ఆయన చేయని మాఫియా దం దా లేదు. తెలంగాణలో బుల్డోజర్ ప్రభుత్వం రావాలి. అవినీతి పరులకు సింహ స్వప్నంగా మారుతాం” అని అన్నారు. ‘‘సింహం ఒక అడుగు ముందుకు వేసే ముందు.. రెండు అడుగులు వెనక్కి వేస్తుంది. తెలంగాణలో బీజేపీ కూడా అంతే.. ఒక్క అడుగు వెనక్కి వేసిందంటే పది అడుగులు ముందుకు వేస్తుందని అర్థం. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ఒక్కటే. ఎవరికి ఓటు వేసినా వృథానే” అని ఆరోపించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా చేస్తామని ప్రకటించారు. ఈ నెల 24న డబుల్ బెడ్రూమ్‌ ఇండ్ల కోసం ధర్నాకు పిలుపునిస్తున్నామన్నారు. 25న ఇందిరాపార్కులో పెద్ద ఎత్తున నిరసన చేపడుతామని తెలిపారు.

సంజయ్‌ని గుండెల్లో పెట్టుకోవాలి: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

పార్టీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ దిగిపోయిన తర్వాత... ఆయన్ను చూసి తన కండ్లల్లో నీళ్లు తిరిగాయని బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బాధను ఆపుకోలేక బాత్ రూమ్ లోకి వెళ్లి ఏడ్చానని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీకి జోష్ వచ్చిందంటే కారణం బండి సంజయేనని, పార్టీ కోసం కష్టపడ్డ సంజయ్‌ని గుండెల్లో పెట్టుకోవాలని చెప్పారు. ఆయన్ను ఉన్నత పదవిలో చూడాలని ఉందని అన్నారు. ‘‘మునుగోడులో బీజేపీదే నైతిక విజయం. దుబ్బాక, హుజూరాబాద్‌లో బండి సంజయ్ నాయకత్వంలోనే గెలిచాం. జీహెచ్ఎంసీలో మంచి  ఫలితాలు వచ్చాయి” అని చెప్పారు. ‘‘నేను పార్టీ మారే ప్రసక్తే లేదు. కేసీఆర్‌‌కు వ్యతిరేకంగా పోరాడేందుకే బీజేపీలో చేరాను. కిషన్ రెడ్డి నాయకత్వంలో రానున్న ఎన్నికల్లో సమష్టిగా పనిచేద్దాం. కాంగ్రెస్ లో కొందరు పేరు చెప్పుకుని బతుకుతున్నారు. మోదీకీ సరిపోయే నాయకుడు దేశంలో ఎవరైనా ఉన్నారా? బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎప్పుడూ ఒకటి కాదు. బిడ్డను కాపాడుకునేందుకు కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ఈడీని మేనేజ్ చేస్తున్నాడు” అని మండిపడ్డారు.

ఎన్నికల్లో సునామీ చూస్తరు: ధర్మపురి అరవింద్

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సునామీ చూస్తారని ఎంపీ అర్వింద్ అన్నారు. కిషన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. త్రిపురలో బీజేపీకి ఒక్క శాతం ఓటు ఉన్నా అధికారంలోకి వచ్చామని గుర్తు చేశారు. ఈటల రాజేందర్ గజ్వేల్‌లో పోటీ చేసుడు కాదని, దమ్ముంటే కేసీఆరే హుజూరాబాద్‌కే వచ్చి పోటీ చేయాలని డిమాండ్ చేశారు.

బీఆర్‌‌ఎస్‌ది అధికార, డబ్బు మదం: ఈటల

రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేందుకు కలిసికట్టుగా పనిచేయాలని బీజేపీ ఎలక్షన్ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా బీజేపీనే గెలిచిందని చెప్పారు. 

వంద రోజులు కష్టపడి పని చేయాలి: రఘునందన్ రావు

కేసీఆర్ అహంకారానికి చరమ గీతం పాడాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు పిలుపునిచ్చారు. వంద రోజులు కంకణ బద్ధులై బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు నాయకులు, కార్యకర్తలు పని చేయాలని కోరారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నదని చెప్పారు. డబుల్ బెడ్రూమ్‌ ఇండ్ల నిర్మాణాల పరిశీలనకు వెళ్తుంటే పోలీసులు అరెస్టు చేయడం అన్యాయమన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని, ఇక్కడి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జ్‌ ప్రకాశ్ జవదేకర్, పార్టీ నేతలు లక్ష్మణ్, డీకే అరుణ, విజయశాంతి, మురళీధర్ రావు, వివేక్ వెంకటస్వామి, ఇంద్రసేనా రెడ్డి, సోయం బాపూరావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

అమరులకు నివాళులర్పించి..

శుక్రవారం కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించడానికి ముందు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్‌లో, బషీర్‌‌బాగ్‌లోని కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. అంబర్ పేటలోని జ్యోతిబాపూలే విగ్రహానికి, ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత అసెంబ్లీ ఎదురుగా గన్ పార్క్ లోని తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి అక్కడి నుంచి ర్యాలీగా పార్టీ స్టేట్ ఆఫీసుకు చేరుకున్నారు. సీనియర్ నేతల సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డిని వివేక్ వెంకటస్వామి శాలువా కప్పి అభినందించారు. ఆయనతో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు అభినందించారు.

ఇయ్యాల గజ్వేల్‌కు కిషన్ రెడ్డి

బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి శనివారం గజ్వేల్ కు వెళ్లనున్నారు. ఇటీవల జైలుకు వెళ్లి వచ్చిన పార్టీ కార్యకర్తలను ఆయన పరామర్శించనున్నారు.

కేసీఆర్​ అవినీతి సర్కార్​ను తరుముదాం: తరుణ్​ చుగ్

తెలంగాణ నుంచి కేసీఆర్ కుటుంబ పాలనను తరిమికొట్టాలని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌చార్జ్‌‌ తరుణ్ చుగ్ అన్నారు. ‘‘అహంకార పూరితమైన వ్యక్తిని తరిమికొట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. అవినీతి పాలనను పారదోలాలని చూస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఈ సర్కార్ ను ఓడగొట్టేందుకు సిద్ధమయ్యారు. రాబోయే వంద రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం”అని ధీమా వ్యక్తం చేశారు.

కేసీఆర్‌‌పై కచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి: రవీంద్ర నాయక్

కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేస్తారా? లేక నిర్దోషిగా తేలుస్తారా? తేల్చాలని మాజీ మంత్రి రవీంద్ర నాయక్ డిమాండ్ చేశారు. కేసీఆర్ అవినీతిపై మోదీ ఊరికే చెప్పరని, కేసీఆర్‌‌పై కచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని కోరారు. కేసీఆర్, కవితపై చర్యలు తీసుకోని పక్షంలో వారిది తప్పు లేదని ప్రకటించాలన్నారు. ‘‘ఇక్కడ కేసీఆర్ ఎవరికీ అపాయింట్‌మెంట్ ఇవ్వడు. అదే కేసీఆర్ ఢిల్లీకి వెళ్తే.. బీజేపీ అపాయింట్ మెంట్ ఇస్తుంది. అభివృద్ధి కోసం ఎవరితోనైనా కలిసి మాట్లాడే అవకాశాన్ని బీజేపీ కల్పిస్తుంది” అని తెలిపారు.

నాపై లేనిపోని ఫిర్యాదులు చేశారు: బండి సంజయ్

తన విషయంలో చేసినట్లుగా కిషన్ రెడ్డిపై తప్పుడు రిపోర్టులను హైకమాండ్‌కు ఇవ్వొద్దని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కోరారు. ‘‘ఇకనైనా లేనిపోని ఫిర్యాదులు చేయడం మానుకోండి. తప్పుడు రిపోర్టులు బంద్ చేసి, కిషన్ రెడ్డినైనా ప్రశాంతంగా పనిచేయనీయండి. ఇప్పుడు కాకుంటే మళ్లీ బీజేపీ అధికారంలోకి రావడం కష్టసాధ్యం. కార్యకర్తలంతా బీజేపీ కోసం పనిచేస్తున్నారు. చాలా మంది బీజేపీలో చేరారు. దయచేసి తప్పుడు ఫిర్యాదులు చేయడం, తప్పుడు రిపోర్టులు ఇయ్యడం బంద్ చేయండి. నమ్ముకుని వచ్చిన నాయకులను, నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్తల ఆశలను వమ్ము చేయకండి” అని విజ్ఞప్తి చేశారు. మీడియాలో, సోషల్ మీడియాలో ఫొటోలు రావాలని ఆశపడే వారు అక్కడే ఆగిపోతారని, ప్రజల కోసం పనిచేసే వాళ్లు మాత్రమే పైకి వస్తారని చెప్పారు. ఇప్పటికైనా అందరం కలిసి కట్టుగా సాగితే విజయం బీజేపీదేనని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితమంతా మోసాలమయమేనని, ఆయన సంగతి చూసేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పీఆర్సీని వేస్తున్నట్లు మీడియాకు లీకులిచ్చి ఉద్యోగులను మరోసారి మోసం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు.