అక్టోబర్ 26న సీఈసీ భేటీ.. అదేరోజు ఫైనల్​ లిస్ట్​ రిలీజ్​!

అక్టోబర్ 26న సీఈసీ భేటీ.. అదేరోజు ఫైనల్​ లిస్ట్​ రిలీజ్​!
  • కాంగ్రెస్​ స్క్రీనింగ్​ కమిటీలో నేతల నిర్ణయం

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో కాంగ్రెస్​ పార్టీకి అనుకూల వాతావరణం కనిపిస్తున్నదని.. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎలాంటి తప్పిదాలకు తావివ్వొద్దని పార్టీ సీనియర్ నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ నెల 15న 55 మంది అభ్యర్థులతో రిలీజ్ చేసిన ఫస్ట్ లిస్ట్ లో సిట్టింగ్ లు, మాజీలు, పార్టీ ముఖ్య నేతలు ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని, అయితే పార్టీ అధికారంలోకి రావాలంటే మిగిలిన 64 సీట్లు కూడా కీలకమని డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలో సెకండ్ లిస్ట్ లో రిలీజ్ అయ్యే స్థానాలపై క్షేత్ర స్థాయి నుంచి పరిశీలించి ఫైనల్ చేయాలని నిర్ణయానికి వచ్చారు. 

ఆదివారం ఢిల్లీలోని రకాబ్ గంజ్ గురుద్వారా రోడ్ లోని కాంగ్రెస్ వార్ రూంలో స్క్రీనింగ్ కమిటీ భేటీ అయింది. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో సభ్యులు జిగ్నేశ్ మేవాని, ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి, రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి, ఎన్నికల ప్రచార కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. దాదాపు రెండు గంటలకు పైగా సాగిన ఈ భేటీలో లెఫ్ట్ పార్టీలతో పొత్తు, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో అభ్యర్థుల ఎంపిక, మిగిలిన స్థానాలకు సంబంధించిన క్యాండిడేట్లపై చర్చించారు.

ఇప్పటికే భద్రాచలం టికెట్​ వీరయ్యకు..

ఖమ్మం జిల్లాలో తమకు ఒక్క సీటైనా కేటాయించాలని సీపీఎం పట్టుబడుతుండడం, ఆ జిల్లాలకు సంబంధించిన ప్రతి నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ ఆశావహులు ఎక్కువగా ఉండడంతో  ఈ అంశంపై కమిటీ చర్చించింది. ముందు నుంచి సీపీఎం కోరుతున్న భద్రాచలం సీట్ ను కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు కేటాయించింది. అలాగే మధిర, పాలేరు ఏ స్థానాన్ని ఇచ్చే పరిస్థితుల్లో కాంగ్రెస్ లేదని సీనియర్ నేతలు చెబు తున్నారు. ఈ రెండు అంశాలపై హైదరాబాద్ వేదికగా సీపీఎం నేతలతో మరోసారి చర్చించి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. ఇక మిగిలిన స్థానాల్లో అప్లికేషన్లను పరిశీలించి 2 పేర్లతో తుది జాబితాను కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ(సీఈసీ)కి పంపాలని డిసైడ్ అయ్యారు.

25న స్క్రీనింగ్​ కమిటీ మరోసారి భేటీ!

అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ కోసం ఈ నెల 25న మరోసారి స్క్రీనింగ్ కమిటీ భేటీ కానున్నట్లు సమాచారం. ఆ రోజు భేటీలో లెఫ్ట్ పార్టీలతో పొత్తుపై క్లారిటీ, వారికి సీట్ల కేటాయింపు.. మిగిలిన స్థానాలకు అభ్యర్థులతో ఫైనల్ లిస్ట్ ను రూపొందించ నున్నారు. తర్వాత సీఈసీ కి లిస్ట్ పంపనున్నారు. ఈ నెల 26 న సీఈసీ భేటీ కానుందని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశం తర్వాత తెలంగాణలో మిగిలిన స్థానాలకు సంబంధించిన లిస్ట్ రిలీజ్ చేస్తామని వెల్లడించాయి.