
- ఆమెతో పాటు ఏరియా కమిటీ మెంబర్ రామన్న కూడా..
ఎల్బీనగర్, వెలుగు: ఇద్దరు మావోయిస్టులు రాచకొండ సీపీ సుధీర్ బాబు ఎదుట లొంగిపోయారు. ఇందులో స్టేట్ కమిటీ సీనియర్ మెంబర్, కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ భార్య కాకరాల సునీత(62), ఏరియా కమిటీ సభ్యుడు చెన్నూరి హరీశ్(35) అలియాస్ రామన్న ఉన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీపీ గురువారం మీడియాకు వెల్లడించారు. 1968లో రాజమండ్రిలో జన్మించిన సునీత.. 1986లో ఇంటర్మీడియెట్ చదివే క్రమంలో సీపీఐ(ఎంఎల్) పీపుల్స్ వార్ కు ఆకర్షితురాలై అజ్ఞాతంలోకి వెళ్లింది. 1986 నుంచి 1990 వరకు విజయవాడలో సెంట్రల్ ఆర్గనైజర్(సీవో)గా పనిచేసింది. 1986లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ ను ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తరువాత పలు హోదాల్లో పనిచేసి సెంట్రల్ కమిటీ మెంబర్ వరకు ఎదిగింది.
వెలిగొండ, భైరవకోన, పూజారిగూడ, కుతుల్, నేషనల్ పార్క్ఎన్కౌంటర్లలో పాల్గొన్నారు. ఆమె భర్త నేషనల్ పార్క్ ఎన్కౌంటర్లో మృతిచెందాడు. సునీత 40 ఏండ్ల పాటు మావోయిస్టు పార్టీలో పనిచేశారు. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రంగయ్యపల్లి గ్రామానికి చెందిన చెన్నూరి హరీశ్ 2006లో ఏటూరునాగారంలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్‌లో పదో తరగతి చదువుతున్నప్పుడు మావోయిస్టు పార్టీకి ఆకర్షితుడయ్యాడు. 2018లో భార్యకు విడాకులు ఇచ్చి మావోయిస్టు పార్టీలో చేరేందుకు ప్రయత్నించి అరెస్టయ్యాడు. తిరిగి 2020లో పార్టీలో చేరాడు. వివిధ దళాల్లో పనిచేసి 2024లో ఏరియా కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొందాడు. సునీతపై రూ.20 లక్షలు, హరీశ్‌పై రూ.4 లక్షల రివార్డు ఉంది. వారు స్వయంగా పోలీసులకు లొంగిపోవడంతో ఆ రివార్డును వారికే అందజేసినట్టు సీపీ సుధీర్‌బాబు తెలిపారు.