వాలీబాల్లో గెలిచారని జూనియర్లపై సీనియర్ల దాడి

వాలీబాల్లో గెలిచారని జూనియర్లపై సీనియర్ల దాడి
  • గంగాధర బీసీ గురుకుల స్కూల్లో ఘటన

గంగాధర, వెలుగు: వాలీబాల్ పోటీలో జూనియర్లు గెలవడంతో కోపోద్రిక్తులైన సీనియర్ విద్యార్థులు జూనియర్లపై దాడి చేశారు. ఈ ఘటన గంగాధర మండలంలోని బీసీ బాలుర గురుకుల పాఠశాలలో శుక్రవారం రాత్రి జరిగింది. పదో తరగతికి చెందిన 20 మంది విద్యార్థులు, తొమ్మిదో తరగతికి చెందిన 12 మందిని మూడు గంటల పాటు చితకబాదినట్లు సమాచారం. దెబ్బలు తట్టుకోలేక ఓ విద్యార్థి గోడ దూకి పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్‌‌‌‌కు వెళ్లి సమాచారమిచ్చాడు. పోలీసులు వచ్చే వరకు మ్యాథ్స్ టీచర్ రమేశ్, నైట్ వాచ్‌‌‌‌మన్ శంకర్‌‌‌‌కు విషయం తెలియకపోవడం గమనార్హం.

గాయపడిన విద్యార్థులను రహస్యంగా స్థానిక పీహెచ్‌‌‌‌సీకి తరలించి చికిత్స అందించగా, ఇద్దరిని కరీంనగర్ సివిల్ హాస్పిటల్​కు తరలించారు. శనివారం విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు స్కూల్​కు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఎంఈవో ఏనుగు ప్రభాకర్‌‌‌‌రావు, తహసీల్దార్ అంబటి రజిత, పోలీసులు విచారణ చేపట్టారు. ప్రిన్సిపాల్ పర్యవేక్షణ లోపం, టీచర్ల నిర్లక్ష్యంతోనే ఘటన జరిగిందని తల్లిదండ్రులు ఆరోపించారు. ఘటనపై నివేదికను కలెక్టర్‌‌‌‌కు పంపుతామని అధికారులు తెలిపారు.