V6 News

ఫెడ్ ప్రకటనతో మార్కెట్‌లో జోష్.. ర్యాలీ ఇంకా కొనసాగుతుందా..

ఫెడ్ ప్రకటనతో మార్కెట్‌లో జోష్.. ర్యాలీ ఇంకా కొనసాగుతుందా..

మూడు రోజుల పాటు కొనసాగిన పతనానికి తెరదించుతూ భారతీయ స్టాక్ మార్కెట్లు గురువారంఅద్భుతమైన వృద్ధిని నమోదు చేశాయి. మార్కెట్ల క్లోజింగ్ నాటికి సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ 25,850 స్థాయిని దాటి ముగిసింది. దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో చోటు చేసుకున్న ఆరు కీలక పరిణామాలు ఈ పరుగుకు ప్రధాన కారణాలుగా నిలిచాయి.

మార్కెట్ల ర్యాలీకి కారణాలు..
1. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూలత: ఫెడ్ ప్రకటనతో అమెరికా మార్కెట్లు గట్టి లాభాలతో ముగియడం, ఆసియా మార్కెట్లలో సానుకూల ధోరణి కనిపించడం భారతీయ పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను పెంచింది.

2. విదేశీ పెట్టుబడిదారుల కొనుగోళ్లు: గత కొన్ని సెషన్లలో అమ్మకాలకు మొగ్గు చూపిన FIIలు.. ఈరోజు కొనుగోళ్లను ప్రారంభించినట్లు అంచనా. ఇది మార్కెట్‌కు అత్యంత అవసరమైన లిక్విడిటీని అందించింది.

3. క్రూడ్ ఆయిల్ తగ్గుదల: అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం, ద్రవ్యోల్బణంపై ఒత్తిడిని తగ్గిస్తుందని, భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని మార్కెట్ భావించింది.

4. బ్యాంకింగ్ రంగంలో వృద్ధి: నేడు ఆర్ధిక వ్యవస్థకు వెన్నెముక లాంటి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగాల షేర్లు భారీగా పెరిగాయి. నిఫ్టీ వృద్ధిలో కీలక పాత్ర పోషించాయి నేడు.

5. బలమైన త్రైమాసిక ఫలితాల అంచనాలు: రాబోయే త్రైమాసిక ఫలితాలు అంచనాలకు మించి ఉండే అవకాశం ఉందని అంచనాలు వెలువడటం మార్కెట్లో కొన్ని కంపెనీల షేర్లను పైకి నడిపించింది.

6. టెక్నికల్ సపోర్ట్: నిఫ్టీ కీలక మద్దతు స్థాయి25,500 వద్ద పుంజుకోవడం, షార్ట్-సెల్లింగ్ చేసిన ట్రేడర్లను కొనుగోళ్లకు ప్రేరేపించింది. ఇది మార్కెట్ల పురోగతికి దారితీసింది.

మార్కెట్లు మరింత పెరుగుతాయా..?
ప్రస్తుతానికి మార్కెట్ బుల్లిష్ ధోరణిని కొనసాగించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దేశీయ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండటం, కార్పొరేట్ కంపెనీల లాభాలు మెరుగ్గా ఉండటం, ద్రవ్యోల్బణం అదుపులో ఉండే సంకేతాలు కనిపించడం వంటి అంశాలు వృద్ధికి దోహదపడతాయని చెబుతున్నారు. అయితే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలు,  అంతర్జాతీయ భౌగోళిక-రాజకీయ పరిణామాలు మార్కెట్‌పై ఒత్తిడి పెంచే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.