భారత స్టాక్ మార్కెట్లు రిజర్వు బ్యాంక్ వడ్డీ రేట్ల పెంపు ప్రకటన నాటి నుంచి నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రయాణం మెుదలుపెట్టిన స్టాక్ మార్కెట్ సూచీలు మధ్యాహ్నం నాటికి భారీ పతనానికి గురయ్యాయి. ఈ క్రమంలో 12.52 గంటల నాటికి సెన్సెక్స్ సూచీ 910 పాయింట్లు, నిఫ్టీ సూచీ 319 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ 311 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1088 పాయింట్లు కోల్పోయాయి.
క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదలకు తోడుగా మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు డబ్బు వెనక్కి తీసుకోవటం తోడవటంతో ఓలటాలిటీ పెరుగుతోంది. ఇదే క్రమంలో భారత సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచేయటం.. అమెరికా ఫెడ్ మినిట్స్ కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూడటం సూచీలను ఊహించని నష్టాల దిశగా నడిపిస్తోంది. ఈసారి కూడా వడ్డీ రేట్ల గురించి ఫెడ్ ఎలా ముందుకెళుతుందనే అంశంపై ఇన్వెస్టర్ల దృష్టి ప్రస్తుతం కొనసాగుతోంది.
ఇదే క్రమంలో వ్యాపారుల రిక్వెస్ట్ మేరకు పేమెంట్స్ కార్పొరేషన్ కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖతో యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్ ఛార్జీల అమలు వాయిదా చర్చల వార్తలు పేటీఎం, పైనా ల్యాబ్స్, మెుబిక్విక్ లాంటి పేమెంట్ అగ్రికేషన్ స్టాక్స్ కుప్పకూలేలా చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లలోని అన్ని రంగాలు దాదాపు నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. మారుతున్న ఆర్థిక పరిస్థితులను పరిశీలిస్తూ ఇన్వెస్టర్లు ముందుకు సాగాలని మార్కెట్ నిపుణులు పెట్టుబడిదారులను ప్రస్తుతం హెచ్చరిస్తున్నారు.
