కొనసాగిన మార్కెట్ ర్యాలీ .. 75 వేల పైన సెన్సెక్స్‌‌‌‌

కొనసాగిన మార్కెట్ ర్యాలీ ..  75 వేల పైన సెన్సెక్స్‌‌‌‌

ముంబై: సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌‌‌, నిఫ్టీ వరుసగా రెండో  సెషన్‌‌‌‌లోనూ  లాభాల్లో కదిలాయి. ఎన్‌‌‌‌డీఐ ప్రభుత్వం ఏర్పాటు కానుండడంతో ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్ పెరిగింది. సెన్సెక్స్ గురువారం సెషన్‌‌‌‌లో 692 పాయింట్లు (0.93 శాతం) లాభపడి  75,075 దగ్గర సెటిలయ్యింది. నిఫ్టీ 201 పాయింట్లు ఎగసి 22,821 దగ్గర ముగిసింది.  బీజేపీకి మెజార్టీ సీట్లు రాకపోవడంతో ఈ నెల  4 న సెన్సెక్స్‌‌‌‌, నిఫ్టీ 6 శాతం చొప్పున పతనమయ్యాయి. ఇన్వెస్టర్లు రూ.31 లక్షల కోట్లు నష్టపోయారు. గత రెండు సెషన్లలో  ఇన్వెస్టర్ల సంపద రూ. 21 లక్షల కోట్లు రికవర్ అయ్యింది. బెంచ్‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌లు బుధవారం సెషన్‌‌‌‌లో 3 శాతం పెరగగా, గురువారం ఒక శాతం లాభపడ్డాయి. 

మార్కెట్‌ పాజిటివ్‌‌‌‌గా కదులుతోందని, రానున్న సంకీర్ణ ప్రభుత్వం నిలకడగా ఉంటుందనే అంచనాలు ఉన్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. కానీ, కేబినెట్‌‌‌‌లోకి ఎవరొస్తారు, రానున్న బడ్జెట్‌‌‌‌లో ఎటువంటి పాలసీలను ప్రకటిస్తారనే  ఆందోళనలు పెరిగాయన్నారు. వ్యవస్థలోని లిక్విడిటీపై  ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ చర్యలను మార్కెట్ జాగ్రత్త గమనిస్తోందని వెల్లడించారు.  

లాభాల్లో అదానీ షేర్లు 

అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు గురువారం సెషన్‌‌‌‌లో కూడా లాభాల్లో కదిలాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు 5 శాతం పెరగగా, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌‌‌‌ 5 శాతం, అదానీ టోటల్ గ్యాస్‌‌‌‌ 4 శాతం, ఎన్‌‌‌‌డీటీవీ 4 శాతం, అదానీ పవర్ 3 శాతం, అదానీ విల్మార్‌‌‌‌‌‌‌‌  3 శాతం లాభడ్డాయి.