పొరపాటున రాంగ్ UPIకి డబ్బు పంపారా? కంగారు పడకండి.. ఇలా వెనక్కి తెచ్చుకోండి

పొరపాటున రాంగ్ UPIకి డబ్బు పంపారా? కంగారు పడకండి.. ఇలా వెనక్కి తెచ్చుకోండి

యూపీఐ వచ్చిన తర్వాత మనీ ట్రాన్సాక్షన్స్ చాలా ఈజీ అయ్యాయి. కానీ ఒక్క చిన్న పొరపాటు జరిగినా మనం పంపాల్సిన వారికి కాకుండా వేరొకరికి డబ్బు వెళ్లే ప్రమాదం ఉంది. పొరపాటున రాంగ్ యూపీఐ ఐడీకో లేదా తప్పుడు మొబైల్ నంబర్‌కో డబ్బు పంపిస్తే ఆందోళన చెందడం సహజం. అయితే కంగారు పడకుండా వెంటనే కొన్ని స్టెప్స్ ఫాలో అయితే మీ డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

తక్షణమే స్పందించటం: 
రాంగ్ యూపీఐ ట్రాన్సాక్షన్ జరిగిన వెంటనే మొదటి 24 నుండి 48 గంటలు చాలా కీలకం. RBI రూల్స్ ప్రకారం.. తప్పుడు వివరాలు నమోదు చేయడం వల్ల జరిగే లావాదేవీలకు వినియోగదారుడే బాధ్యుడు. అయినప్పటికీ నగదు రికవరీ కోసం బ్యాంకులు, ఎన్‌పీసీఐ ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశాయి. మీ నగదు పొరపాటున ఇతరులకు వెళ్తే వెంటనే మీరు వాడుతున్న పేమెంట్ యాప్ గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎంలో 'Help' లేదా 'Report a Problem' సెక్షన్‌కు వెళ్లి కంప్లెయింట్ రైజ్ చేయాలి.

బ్యాంకును సంప్రదించడం మర్చిపోకండి: 
యాప్‌లో కంప్లెయింట్ చేయడంతో పాటు.. మీ బ్యాంక్ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలపాలి. కుదిరితే నేరుగా హోమ్ బ్రాంచ్‌కు వెళ్లి మేనేజర్‌ను కలిసి లిఖితపూర్వక ఫిర్యాదు ఇవ్వండి. మీ ఫిర్యాదులో ట్రాన్సాక్షన్ ఐడీ , తేదీ, సమయం మీరు పంపిన తప్పుడు యూపీఐ ఐడీ వివరాలను స్పష్టంగా ఇవ్వాలి. అవతలి వ్యక్తి ఖాతా మీ బ్యాంకులోనే ఉంటే నగదు వెనక్కి వచ్చే ప్రక్రియ వేగంగా జరుగుతుంది. ఒకవేళ వేరే బ్యాంకు అయితే.. మీ బ్యాంక్ వారు ఆ బ్యాంకును సంప్రదించి సదరు వ్యక్తి అనుమతితో డబ్బు వెనక్కి వచ్చేలా ప్రయత్నిస్తారు. 

►ALSO READ | మ్యూచువల్ ఫండ్స్ మధ్యలో వదిలేస్తున్నారా? ఆగండి.. ఈ 4 తప్పులు చేస్తున్నారేమో చూస్కోండి..

NPCI పోర్టల్: 
మీ సమస్య యాప్ లేదా బ్యాంక్ స్థాయిలో పరిష్కారం కాకపోతే.. నేరుగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చు. వెబ్‌సైట్‌లోని Dispute Redressal Mechanismలోకి వెళ్లి.. మీరు చేసిన తప్పుడు లావాదేవీ వివరాలను ఇవ్వాలి. అలాగే ఎన్‌పీసీఐ వారి టోల్ ఫ్రీ నంబర్ 1800-120-1740 కు కాల్ చేసి కూడా మీ సమస్య గురించి కంప్లెయింట్ చేసేందుకు వీలు ఉంటుంది. 

RBI అంబుడ్స్‌మన్: 
మీరు కంప్లెయింట్ ఇచ్చిన 30 రోజుల వరకు బ్యాంకు నుండి సరైన సమాధానం రాకపోతే.. మీరు RBI CMS పోర్టల్ ద్వారా ఆర్బీఐ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదును మళ్లించవచ్చు. డిజిటల్ లావాదేవీల రక్షణ కోసం ప్రభుత్వం కల్పించిన అత్యున్నత స్థాయి పరిష్కార మార్గం ఇది. 

డబ్బు పంపే ముందే అవతలి వ్యక్తి పేరును క్రాస్ చెక్ చేసుకోవడం అన్నింటికంటే సురక్షితం అని గుర్తుంచుకోండి. పొరపాటు వల్ల చేతిలో ఉన్న డబ్బులు రాంగ్ వ్యక్తికి పోయిన తర్వాత ఇలా ఇబ్బంది పడకుండా ముందుగానే ఒకటికి రెండుసార్లు వివరాలు చెక్ చేసుకుని పేమెంట్స్ చేయటం అన్నింటికంటే మంచి మార్గం అని మర్చిపోకండి.