రేపు (సెప్టెంబర్ 27న) సీఎం చేతుల మీదుగా..గ్రూప్1 అభ్యర్థులకు నియామక పత్రాలు : సీఎస్ రామకృష్ణారావు

రేపు (సెప్టెంబర్ 27న) సీఎం చేతుల మీదుగా..గ్రూప్1 అభ్యర్థులకు నియామక పత్రాలు :  సీఎస్ రామకృష్ణారావు
  • శిల్పకళా వేదికలో ఏర్పాట్లపై సీఎస్​రామకృష్ణారావు సమీక్ష

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీఎఎస్సీ) ద్వారా ఎంపికైన గ్రూప్-1 అభ్యర్థులకు శనివారం సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేస్తారని సీఎస్​రామకృష్ణారావు తెలిపారు. ఈ కార్యక్రమం శనివారం సాయంత్రం శిల్పకళా వేదికలో జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమం ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో గురువారం సీఎస్​టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 

మొత్తం 562 మంది అభ్యర్థులకు సీఎం అపాయింట్‌‌మెంట్ ఆర్డర్లు అందజేయనున్నారు. ఎంపికైన అభ్యర్థుల్లో దాదాపు 18 ప్రభుత్వ శాఖలకు చెందినవారున్నారు. వీరిలో రెవెన్యూ, హోం, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన అభ్యర్థులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులందరినీ ఆహ్వానిస్తున్నట్టు సీఎస్ తెలిపారు.

 నియామక పత్రాలు పొందే అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమాన్ని శుక్రవారంలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే, ప్రతి అభ్యర్థికి ఇద్దరు కుటుంబ సభ్యులను కార్యక్రమానికి అనుమతించాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని అభ్యర్థులకు స్ఫూర్తినిచ్చేలా, ప్రభుత్వ సేవ పట్ల వారికి సానుకూల దృక్పథం కలిగేలా ఏర్పాట్లు చేయాలని సీఎస్ కోరారు.

 ఎంపికైన అధికారులు సుమారు 30 సంవత్సరాల పాటు ప్రభుత్వ సేవలో ఉంటారని, వారికి భరోసా కలిగించే వాతావరణంలో నియామక పత్రాలు అందజేయాలని సూచించారు. ఈ టెలికాన్ఫరెన్స్‌‌లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సబ్యసాచి ఘోష్, వికాస్ రాజ్, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా, డీజీపీ జితేందర్, ముఖ్య కార్యదర్శులు బెనహర్ మహేశ్ దత్ ఎక్కా, సందీప్ కుమార్ సుల్తానియా, కార్యదర్శులు లోకేశ్ కుమార్, టీకే శ్రీదేవి, జీహెచ్‌‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.