
- గత నెల 15 నుంచి కనిపించకుండా పోయిన వ్యక్తి
- ఖమ్మం జిల్లా దానవాయిగూడెంలో దొరికిన తల, చేతులు
ఖమ్మం/ కామేపల్లి, వెలుగు : గత నెల 19న ఖమ్మం జిల్లాలో కనిపించకుండా పోయిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. తల, చేతులు దానవాయిగూడెం సమీపంలో కనిపించగా.. మొండెం మాత్రం ఇంకా దొరకలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కామేపల్లి మండలం కెప్టెన్ బంజర గ్రామానికి చెందిన గట్ల వెంకట్ (38) హైదరాబాద్‌లోని బోరబండలో బాయ్స్ హాస్టల్ నడుపుతున్నాడు. ఓ ఫంక్షన్ కోసం గత నెల 13న గ్రామానికి వచ్చిన వెంకట్ 15న హైదరాబాద్‌కు వెళ్తేందుకు ఇంటి నుంచి బయలుదేరి ఆ తర్వాత కనిపించకుండాపోయాడు.
దీంతో అతడి బావమరిది యాదగిరి గత నెల 19న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. మూడు రోజుల కింద వెంకట్‌కు చెందిన ఏటీఎం కార్డు ద్వారా డబ్బులు డ్రా అయినట్లు తేలడంతో దాని ఆధారంగా ఎంక్వైరీ చేపట్టిన పోలీసులు ఏపీకి చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా.. హత్య విషయం వెలుగుచూసింది. ఈ కేసులో మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు, హత్యకు వివాహేతర సంబంధమే కారణని తెలుస్తోంది.