సాయుధ పోరాట ఫలితమే విలీనం

సాయుధ పోరాట ఫలితమే విలీనం

దేశానికి స్వాతంత్ర్యం 1947 ఆగస్టు 15న రాగా హైదరాబాద్​  సంస్థానంలో 1948 సెప్టెంబర్​ 17న దాదాపు ఒక సంవత్సరం తరువాత మువ్వన్నెల జెండా ఎగిరింది. ఆ నడుమ కాలంలో ప్రజోద్యమం ఉధృతంగా కొనసాగుతున్న క్రమంలో ఆంధ్ర మహాసభ ప్రతినిధిగా రావి నారాయణరెడ్డి,  కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధిగా బద్దంఎల్లారెడ్డి,  ఏఐటీయూసీ ప్రతినిధిగా మగ్దూం మొహియుద్దీన్​లు 1947  సెప్టెంబర్​ 11న సాయుధ  పోరాటానికి పిలుపునిచ్చారు.  నిజాం నవాబుకు, భూస్వాములకు ప్రేవేట్​ సైన్యంగా ఉన్న ఖాసీం రజ్వీ నేతృత్వంలోని రజాకారులపై ప్రజలు ఎర్రజెండా పట్టుకొని తిరగబడ్డారు. వారి తుపాకీ గుళ్లకు ఎదురొడ్డి ఒడిసెలు, గుత్పలు, కారాలతో ఎదురు తిరిగారు. కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సాయుధ దళాలు ప్రజలకు దిశానిర్దేశం చేస్తూ దొరల, భూస్వాముల కబంధ హస్తాల నుంచి ఒక్కొక్క గ్రామాన్ని విముక్తి చేస్తూ 3 వేల గ్రామాల్లో 10 లక్షల ఎకరాలను ప్రజలకు పంచిన ఘన చరిత్ర  ఆ మహత్తర  పోరాటానిది.  దాదాపు 4,500 మంది యోధుల ప్రాణాలను తెలంగాణ నేల తల్లికి అర్పణ చేసి పోరాట సమిధలై తెలంగాణ నేలను ఎర్రనేలగా మార్చి నెత్తుటి అక్షరాలతో చరిత్రలో లిఖించారు.  


భారతదేశంలో విప్లవాల పురిటిగడ్డ అనగానే తెలంగాణ ముందు వరుసలో ఉంటుంది.  నిజాం రాచరిక ప్రభుత్వాన్ని అంతమొందించడానికి జరుగుతున్న రైతాంగ పోరాటాన్ని నివారించడానికి భారత యూనియన్​ సైన్యాలు 1948 సెప్టెంబర్​ 13న హైదరాబాద్​ చేరుకోవడం జరిగింది. నిజాం పటేల్​ల మధ్య జరిగిన చీకటి ఒప్పంద ఫలితమే సెప్టెంబర్​ 17న విలీనం చేస్తున్నట్లు నిజాం రాజు ప్రకటించాడు. 1956 వరకు రాజ్​ ప్రముఖ్​గా కొనసాగి రాజభరణాలు పొందడం జరిగింది. అయితే, అప్పటివరకు స్వాతంత్ర్యం కోసం ప్రజలను సమాయత్తపరిచి, సంస్థాన విలీన ప్రక్రియను కమ్యూనిస్టులు సులభతరం చేశారు. కమ్యూనిస్టులు పేదలకు పంచిన 10లక్షల ఎకరాల భూములను భూస్వాములకు తిరిగి అప్పజెప్పడానికి, కమ్యూనిస్టుల ఊచకోతకు అప్పటి ప్రభుత్వం పూనుకున్నది. ఈ పరిణామాల నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటాన్ని కొనసాగించింది. చివరకు పలు కోణాలలో చర్చించి 1951 మేలో దానిని విరమించింది. 

నిర్బంధంలోనూ గెలిపించిన ప్రజలు

1952 నాటికి మన నాయకులు ఎక్కువ మంది జైళ్లలో ఉండటం వలన, ఓటర్​ లిస్టులో పేర్లు నమోదు కానందువల్ల అభ్యర్థులు దొరకని కారణంతో అన్ని స్థానాలకు పోటీ చేయలేకపోయాం. అప్పటికీ పార్టీపైన నిషేధం తొలగలేదు. దానివలన పీడీఎఫ్​ (పీపుల్​ డెమోక్రటిక్​ఫ్రంట్) పేరుతో కొన్ని స్థానాల్లోనే పోటీచేసిన కమ్యూనిస్టు పార్టీకి 36సీట్లు రాగా, కాంగ్రెస్​కు అన్ని స్థానాలలో పోటీచేసి కేవలం 38 స్థానాలు మాత్రమే రావడం జరిగింది. నల్గొండ లోక్​సభ స్థానంలో  రావి నారాయణరెడ్డి నాడు భారతదేశవ్యాప్తంగా అమితమైన ప్రజాదరణ కలిగిన జవహర్ లాల్​ నెహ్రూ కంటే ఎక్కువ మెజారిటీ లభించడం ద్వారా తెలంగాణ ప్రజలు కమ్యూనిస్టులను ఎంతగా ఆదరించారో అర్థం చేసుకోవచ్చు. 

విలీన దినోత్సవంగా నిర్వహించాలి

సెప్టెంబర్​ 17న తెలంగాణ ప్రజాపరిపాలన దినోత్సవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్​ ప్రభుత్వం నిర్ణయించడం సబబు కాదు. హైదరాబాద్​ సంస్థానంలో భాగంగా ఉండి, నేడు కర్నాటకలో భాగమైన కల్యాణ కర్నాటక, మరఠ్వాడా ప్రాంతాలలో హైదరాబాద్​ విలీన దినోత్సవాలను ప్రభుత్వాలు ఎప్పటి నుంచో అధికారికంగా నిర్వహిస్తున్నాయి. తెలంగాణ విలీనాన్ని అధికారికంగా జరపడం లేదని సమైక్య రాష్ట్రంలోని ప్రభుత్వాలను దుమ్మెత్తిపోసిన అప్పటి సీఎం కేసీఆర్​ 2021 నుంచి సమైక్యతా దినోత్సవం పేరుతో తెలంగాణ వీర చరిత్రను కనుమరుగయ్యేలా చేశారు.  ఈనాటి కాంగ్రెస్​ ప్రభుత్వం కూడా అదేబాటలో నడుస్తున్నది.  పాత ప్రభుత్వం పెట్టిన పేరును  మార్చి, కనీసం తెలంగాణ వీరోచిత పోరును స్ఫురించేవిధంగా కాకుండా తెలంగాణ ప్రజాపరిపాలన దినోత్సవంగా పాటించాలని నిర్ణయించడం ఏ మాత్రం సమర్థనీయం కాదు. ఆనాటి ఖాసీం రజ్వీ నాయకుడుగా ఉన్న ఈనాటి ఎంఐఎం నేతలకు ఆగ్రహం కలుగుతుందనా లేక మరేదైనా కారణం ఉన్నదా అనే సమాధానం చెప్పాలి. దీన్ని ఆసరాగా తీసుకుని ఈనాటి బీజేపీ, ఆర్​ఎస్​ఎస్​లు ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందూ, ముస్లింల మధ్య ఘర్షణలుగా చిత్రీకరించడానికి  ప్రయత్నిస్తూ తాము రాజకీయంగా తెలంగాణలో బలపడటానికి ఈ ఘటనను ఉపయోగించుకుంటున్నాయి. 

అది రైతాంగ పోరాటం, మతాధార పోరాటం కాదు!

హైదరాబాద్ సంస్థాన రాజు ముస్లిం అయినప్పటికీ జమీందార్లు, జాగీర్దార్లు,  భూస్వాములు దాదాపు 90 శాతం హిందువులే. విసునూరు రామచంద్రారెడ్డి, జన్నారెడ్డి  ప్రతాప రెడ్డి ఇంకా అనేక సంస్థానాధిపతులు  హిందువులే. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అనేకమంది ముస్లింలు కూడా చిత్రహింసలకు గురి అయ్యారు. షేక్ బందగీని విసునూరు రామచంద్రారెడ్డికి చెందిన గుండాలు చంపివేశారు. ప్రఖ్యాత జర్నలిస్టు షోయబుల్లా ఖాన్​ను హైదరాబాద్ నడిబజారులో రజాకార్లు క్రూరంగా చంపారు.  రజబ్ అలి లాంటి యోధులు నిజాం రాచరికానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. డాక్టర్ రాజ్​బహుదూర్ గౌర్ తో కలిసి మగ్దూంమొహియొద్దీన్,  ప్రొ.ఆలంకుంద్ మిరి, జవ్వాద్  రజ్వీ, ప్రొ. ఖయ్యూంఖాన్ లాంటి అనేక మంది ముస్లిం విద్యావేత్తలు నిజాం రాచరికపాలనకు వ్యతిరేకంగా కామ్రేడ్స్ అసోసియేషన్​ను ఏర్పాటు చేశారు. మహ్మద్  రఫీ ఉస్మానియా యూనివర్సిటీలో  నిజాంకు వ్యతిరేకంగా జాతీయ జెండాను ఆవిష్కరణ చేశారు. నిజాం వ్యతిరేకపోరాటంలో అగ్రగామిగానున్న అల్లా ఉద్దీన్​ను నిజాం మూకలు చంపివేయడం జరిగింది. మతాలకు అతీతంగా హిందువులతో సహా వీరోచిత పాత్ర పోషించిన ముస్లింలను విస్మరిస్తే చరిత్ర క్షమించదు.

 పోరాటాల ఫలితమే విలీనం!

ఆనాటి  కమ్యూనిస్టుల  త్యాగాలు, పోరాటాలు లేకుండా  విలీనం జరిగేదా? నిజంగా వారిలో చిత్తశుద్ధి ఉండి ఉంటే  గతంలో బీజేపీ హయాంలో పెండింగ్​లో  ఉన్న తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధులకు పెన్షన్లు ఎందుకు మంజూరు చేయలేదు?  గత పోరాటాలను, త్యాగాలను న్యాయబద్ధంగా స్వీకరిస్తే తప్పులేదు. కానీ రాజకీయ కుట్రతో పోరాట స్వరూపాన్ని వక్రీకరించి లబ్ధి పొందడానికి ప్రయత్నం చేయడమే పెద్ద తప్పు.  ఆ పోరాటంలో హిందువులు,  ముస్లింలు అన్నదమ్ముళ్లులా పాల్గొన్నారు.  ఈ  పోరాటానికి మతం రంగు పులమడమంటే  రానున్న తరాలకు తెలంగాణ వీర చరిత్రను అందకుండా చేసే కుట్ర ఇందులో దాగివున్నది. వీటిని తెలంగాణ ప్రజలు ఎన్నటికీ నమ్మబోరు. ఎందుకంటే ఇక్కడ ఇంటింటికీ పోరాట స్మృతులు ఉన్నాయి.

రైతాంగ సాయుధ పోరాట స్పూర్తికి పునరంకితమవుదాం!

నేటి పాలకుల విధానాలతో ధనిక, పేదల నడుమ అంతరాలు అత్యంత తీవ్రమవుతున్నాయి. భూమికి వివిధ పేర్లతో బడాబాబులు కేంద్రీకృతం చేసుకుంటున్నారు. మతంపేరుతో ప్రజలను విడదీసి ఫాసిస్టు  కార్పొరేట్ ఎజెండాను బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్నది.   వీటికి వ్యతిరేకంగా నాటి  తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో పోరాటాలను ఉధృతం చేయాలి. సెప్టెంబర్ 11-–17 తేదీలలో జరిగే తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా పునరంకితం అవుదాం.  ఈ సందర్భంగా నాటి మహత్తర పోరాటానికి నేతృత్వం వహించిన ఘన వారసత్వం గల కమ్యూనిస్టు పార్టీగా మహోజ్వల చరితను భావి తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందు కొన్ని ప్రతిపాదనలు ఉంచుతున్నాం.

ప్రభుత్వానికి ప్రతిపాదనలు 

సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపరిపాలన దినోత్సవం పేరుగా కాకుండా అధికారికంగా తెలంగాణ విలీన దినోత్సవం పేరుతో నిర్వహించాలి. నాటి మహత్తర తెలంగాణ స్వాతంత్ర్యోద్యమ,  రైతాంగ  సాయుధ పోరాట చరిత్రను రాష్ట్ర, జాతీయ స్థాయిలో  పాఠ్యాంశాలలో  చేర్చాలి.  అమరవీరుల స్మారక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. అందులో ఆనాటి పోరాటంలో అశువులు బాసిన అమరుల పేర్లను,  ఫొటోలను ప్రతి గ్రామం నుంచి అధికారికంగా సేకరించి భావితరాలకు మార్గదర్శకంగా ఉండేలా స్మారక కేంద్రంలో మ్యూజియం ఏర్పా టు చేయాలి. హైదరాబాద్​లో నాటి పోరాట సేనానులు రావి నారాయణ రెడ్డి,  మగ్దూం మొహియుద్దీన్, బద్దం ఎల్లారెడ్డి ఒకే చోట, దొడ్డి కొమరయ్య,  షేక్ బందగీ,  బొమ్మగాని ధర్మభిక్షం, చాకలి ఐలమ్మ లాంటి ఆనాటి సాయుధ పోరాట యోధుల విగ్రహాలను ముఖ్య ప్రదేశాలలో ఏర్పాటు చేస్తే తెలంగాణ ప్రజలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ప్రజానాయకుడు రావి నారాయణరెడ్డి విగ్రహాన్ని పార్లమెంటులో పెట్టాలి. నాటి తెలంగాణ స్వాతంత్ర్య పోరాట నాయకుల పేర్లు చిరస్థాయిగా నిలిచేవిధంగా వివిధ ప్రభుత్వ పథకాలకు వారి పేర్లను పెట్టాలి. 


- కూనంనేని సాంబశివరావు, 
ఎమ్మెల్యే, 
సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి