సెప్టెంబర్ 21న ఛలో ఢిల్లీ పార్లమెంటు ముట్టడి : ఆర్. కృష్ణయ్య

సెప్టెంబర్ 21న ఛలో ఢిల్లీ పార్లమెంటు ముట్టడి : ఆర్. కృష్ణయ్య

బషీర్ బాగ్,- వెలుగు : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో వన్ నేషన్.. వన్ ఎలక్షన్ బిల్లుతో పాటు మహిళా బిల్లు, బీసీ రిజర్వేషన్లు బిల్లు ప్రవేశపెట్టాలని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఇందుకు ఈనెల 21న చలో ఢిల్లీ, పార్లమెంట్ ముట్టడి చేపడుతున్నట్టు తెలిపారు. దేశ జనాభాలో 56 శాతం ఉన్న బీసీల గురించి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించారా..? ఆని ఆయన ప్రశ్నించారు. బీసీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. 

హైదరాబాద్ కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, నాయీబ్రాహ్మణ సంఘం నేత పాల్వాయి శ్రీనివాస్ సంయుక్తాధ్వర్యంలో బీసీ సంఘాల కోర్ కమిటీ సమావేశం శనివారం జరిగింది. ముఖ్యఅతిథిగా ఆర్. కృష్ణయ్య హాజరై మాట్లాడారు. మహిళా బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు తెలపాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు 50 శాతం టికెట్లు కేటాయించాలని, లేకపోతే ఓడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పలు బీసీ సంఘాల నేతలు నీలా వెంకటేష్, నందగోపాల్, వేముల రామకృష్ణ, భాస్కర్,  నిఖిల్, శివ, కోట్ల రామకృష్ణ పాల్గొన్నారు.