గండిపేట: వరుస చోరీలు..దొంగ అరెస్ట్...బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం

గండిపేట: వరుస చోరీలు..దొంగ అరెస్ట్...బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం

గండిపేట, వెలుగు: రాత్రి వేళల్లో ఇళ్ల తాళాలు పగలగొట్టి వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగను అత్తాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి భారీ మొత్తంలో బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్​లోని అఫ్జల్ సాగర్(సీతారాంబాగ్) ప్రాంతానికి చెందిన రిషబ్ శుక్లా(21) సిటీలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డాడు. 

మంగళవారం తేజస్వి నగర్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసులు పట్టుబడ్డాడు. విచారణలో చోరీలకు పాల్పడినట్లు అంగీకరించాడు. నిందితుడి వద్ద నుంచి 20.510 గ్రాముల బంగారు గొలుసు, రెండు బంగారు బ్రాస్‌‌లెట్లు, లాకెట్, ఉంగరం, స్టోన్ రింగ్‌‌తో పాటు రెండు వెండి బిస్కెట్లు, వెండి గ్లాసు, ప్లేట్లు, గిన్నె సహా సుమారు 400 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. చోరీలకు వినియోగించిన బలేనో కారును కూడా సీజ్​ చేశారు.