
- పెద్ద అంబర్ పేటలో వరుస చోరీలు
- గేటెడ్ కమ్యూనిటీలో బంగారం, వెండి అపహరణ
- కొంపల్లిలో ఇనుపరాడ్లు, వేట కొడవళ్లతో హల్చల్
- కిలో వెండి, రూ.12 వేల నగదు దోపిడీ
- దోమలగూడలో వృద్ధ దంపతులపై దాడి చేసి బంగారం రాబరీ
అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: నగరంలో దొంగలు రెచ్చిపోతున్నారు. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా రేయింబళ్లు చోరీలు హల్చల్ చేస్తూ.. పోలీసులకు సవాల్విసురుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో మొన్నటికి మొన్న కాలేజీలో రూ.కోటి చోరీ ఘటన మరవకముందే మరోచోట మళ్లీ దొంగలు పడ్డారు.
పెద్ద అంబర్‌పేటలోని సదాశివ గేటెడ్ కమ్యూనిటీలోని రెండు ఇండ్లలో చోరీ చేశారు. విల్లా నంబర్ 242 యజమాని గూడూరు రాజేందర్ రెడ్డి(75)కి అత్తాపూర్ లో మరో ఇల్లు ఉండగా, కొద్దిరోజులుగా అక్కడే ఉంటున్నాడు. అదే కమ్యూనిటీలో విల్లా 246లో కృష్ణారెడ్డి, జ్యోతి దంపతులు అమెరికా వెళ్లారు.
ఈ క్రమంలో ఈ రెండు విల్లాలకు తాళాలు వేసి ఉండగా, దొంగల కన్ను పడింది. ఆదివారం రాత్రి దొంగలు సెంట్రల్ లాక్ డోర్లను బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు. రెండు ఇండ్లలో 5 కేజీల వెండి సామగ్రి, 35 గ్రాముల బంగారం, రూ.60 వేల నగదు, విలువైన చీరలు దొంగిలించారు. కమ్యూనిటీ వాసుల సమాచారంతో హయత్ నగర్ పోలీసులు సోమవారం ఘటనాస్థలాన్ని పరిశీలించారు. దొంగలు చోరీ చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కాగా, దాని ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు హయత్ నగర్ సీఐ నాగరాజు గౌడ్ తెలిపారు.
పనిచేస్తున్న ఇంటికే కన్నం
ముషీరాబాద్: ముషీరాబాద్‌లోని దోమలగూడలో వృద్ధ దంపతులపై దాడి చేసి ఓ దుండగుడు 8 తులాల బంగారం ఎత్తుకెళ్లాడు. దోమలగూడ హిమాయత్ నగర్ స్ట్రీట్ నంబర్ 6 హెరిటేజ్ అపార్ట్మెంట్లో అనసూయ, -నర్సింగ్‌రావు (80) దంపతులు నివాసం ఉంటున్నారు. ఎనిమిది నెలల కింద ఏపీ గుంటూరు ప్రాంతానికి చెందిన గోవర్ధన్ అనే వ్యక్తిని కేర్ టేకర్ గా పెట్టుకున్నారు. వృద్ధ దంపతులపై గోవర్ధన్సోమవారం దాడి చేసి, సుమారు 8 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. బాధితులు వెంటనే దోమలగూడ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఊరెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల
జవహర్ నగర్: జవహర్ నగర్ పరిధిలోని దమ్మాయిగూడ బ్యాంక్ కాలనీలో భాస్కరరావు నివాసంలో చోరీ జరిగింది. నాలుగు రోజుల కింద ఊరెళ్లిన భాస్కరరావు.. ఆదివారం రాత్రి ఇంటికి వచ్చి చూసేసరికి, కిటికీ రాడ్లు, బీరువా తాళాలు పగలగొట్టి ఉన్నాయి. ఇంట్లో 3 తులాల బంగారం, 7 తులాల వెండి, 3 ఫారన్ వాచ్‌లను కన్పించకపోవడంతో సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇబ్రహీంపట్నంలో 10 తులాల బంగారం చోరీ
ఇబ్రహీంపట్నం : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని బోయవాడలో సోమవారం చోరీ జరిగింది. సీఐ మహేందర్ రెడ్డి వివరాల ప్రకారం.. బోయవాడలో ఉండే ఎలమోని రవీందర్ ఆదివారం సాయంత్రం కొడుకు కార్తీక్‌ను ఇంట్లో ఉంచి భార్య, తల్లితో కలిసి నేరేడ్మెట్లో సోదరి ఇంటికి వెళ్లాడు. సోమవారం తెల్లవారుజామున కార్తిక్ ఇంటికి తాళం వేసి వ్యవసాయ పొలానికి వెళ్లాడు. సాయంత్రం వచ్చి చూడగా తాళాలు పగుల గొట్టి ఉన్నాయి. బీరువాలో 10 తులాల బంగారం, 10 తులాల వెండి ఆభరణాలు, కొంత నగదు చోరీకి గురయ్యాయి.
కొంపల్లిలో వేట కొడవళ్లతో వచ్చి..
జీడిమెట్ల: ఇనుపరాడ్లు, వేట కొడవళ్లతో కొంపల్లిలో దొంగలు హల్చల్చేశారు. తాళం వేసి ఉన్న కొన్ని ఇండ్లలో దోపిడీకి విఫలయత్నం చెందగా, ఓ ఇంట్లో వెండి, నగదు దోచుకెళ్లారు. దండమూడీ కాలనీలో చోరీకి విఫలయత్నం చెందగా, దేవేందర్‌నగర్‌లో మాత్రం ఓ ఇంట్లో నుంచి కిలో వెండి, రూ.12 వేల నగదు దొంగిలించారు. అక్కడే ఉన్న 5 తులాల బంగారాన్ని చూడకపోవడంతో వదిలేసి వెళ్లారు. ఈ ఘటనపై బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.