నేపాల్లో ఏం జరుగుతోంది..వరుస భూకంపాలకు కారణం ఏంటి

నేపాల్లో ఏం జరుగుతోంది..వరుస భూకంపాలకు కారణం ఏంటి

చిన్న దేశం నేపాల్ చిరుగుటాకులా వణికిపోతోంది. వరుస భూకంపాలు నేపాల్ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. వరుసగా భూప్రకంపనలు రావడంతో అసలు నేపాల్ ఏమవుతుందో అని జనం ఆందోళన పడుతున్నారు. ఏప్రిల్ 27వ తేదీ అర్థరాత్రి నేపాల్ లో వరుసగా రెండు సార్లు భూమి కంపించింది.

 దేశంలోని బజురా దహకోట్లో  ఏప్రిల్ 27వ తేదీన గురువారం అర్ధరాత్రి 11.58 గంటలకు భూకంపం సంభవించింది.  దీని తీవ్రత 4.8గా రికార్డయింది.  మరోసారి ఏప్రిల్ 28వ తేదీన అర్థరాత్రి 1.15 గంటలకు మరోసారి భూమి కంపించింది. దీని తీవ్రత 5.9గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ  వెల్లడించింది. అర్ధరాత్రివేళ  వరుసగా  భూమి కంపించడంతో జనం  ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ  భూకంపాల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని స్థానిక అధికారులు వెల్లడించారు.

నేపాల్‌లో ఇటీవల కాలంలో తరుచూ భూకంపాలు సంభవిస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలోనూ నేపాల్లో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేల్‌పై 5.9 తీవ్రతగా నమోదైంది. నేపాల్‌లోని సుదూర్‌ పశ్చిమ్‌ ప్రావిన్సుల్లోని బజురా జిల్లాలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.  ఈ భూకంపం ధాటికి కొండపై నుంచి బండరాయిలు పడి ఓ మహిళ చనిపోయింది. పలు ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. 

ఏప్రిల్ 1వ తేదీన డోలాఖా జిల్లాలోని సూరి వద్ద మోస్తరు తీవ్రతతో భూమి కంపించింది. ఖాట్మండుకు తూర్పున 180 కిలో మీటర్ల దూరంలో డోలాఖా వద్ద పొద్దున 11.27 గంటలకు 5.2 తీవ్రతతో భూకంపం ఏర్పడింది. 

నేపాల్ చరిత్రలో అతిపెద్ద భూకంపం 2015లో చోటు చేసుకుంది . ఆ ఏడాది  ఏప్రిల్ 25న నేపాల్‌లో రిక్టర్ స్కేల్‌పై 7.8 తీవ్రతతో భూమి కంపించింది. సెంట్రల్ నేపాల్‌ ఖాట్మండులో సంభవించిన ఈ భూకంపం వల్ల  9వేల మంది మృతి చెందారు.  వేల మంది గాయపడ్డారు. ఖాట్మండుతో పాటు..ఇతర పట్టణాల్లో 6 లక్షల ఇండ్లు ధ్వంసమయ్యాయి. మధ్య, తూర్పు నేపాల్‌తో పాటు ఉత్తర భారతదేశంలోని గంగా మైదానంలో ఎక్కువ భాగం, వాయువ్య బంగ్లాదేశ్, టిబెట్ పీఠభూమి, పశ్చిమ భూటాన్ దక్షిణ భాగాలపై ఈ భూకంపం ప్రభావం చూపింది. 1932 తర్వాత నేపాల్‌లో సంభవించిన అతి భారీ భూకంపం ఇదే కావడం గమనార్హం.