
- సీజేఐ బీఆర్ గవాయ్‌కి హర్యానా వృద్ధ దంపతులు
- రాసిన లేఖపై సుమోటోగా కేసు
- న్యాయమూర్తుల నకిలీ సంతకాలతో అమాయకులను దోచేస్తున్నరు
- దీనిని సాధారణ నేరంగా పరిగణించలేం..
- ఇలాంటివి న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తాయని ఆందోళన
- స్పందన తెలపాలని కేంద్ర ప్రభుత్వం, సీబీఐకి నోటీసులు
న్యూఢిల్లీ: దేశ్యవాప్తంగా రోజురోజుకూ పెరిగిపోతున్న డిజిటల్అరెస్ట్లపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వీటిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర సర్కారును ఆదేశించింది. హర్యానాలోని అంబాలాకు చెందిన ఓ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఓ సీనియర్ సిటిజన్ జంటను కోర్టు పత్రాలు అని చూపిస్తూ కుట్రపూరితంగా కొందరు మోసం చేశారు.
దీనివల్ల వారు రూ.1.05 కోట్లు మోసపోయారు. దీనిపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయమాల బాగ్చితో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. డిజిటల్ అరెస్టు మోసాలపై స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం, సీబీఐకి నోటీసులు జారీ చేసింది.
న్యాయమూర్తులకు సంబంధించి నకిలీ సంతకాలు, సుప్రీం, హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు పత్రాలు చూపించి నేరాలకు పాల్పడటం వల్ల న్యాయవ్యవస్థపై ప్రజలకున్న విశ్వాసం దెబ్బతింటున్నదని ఆందోళన వ్యక్తంచేసింది. వీటిని సాధారణ నేరాలుగా పరిగణించలేమని, ఇలాంటి నేరాలను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర పోలీసులు, దర్యాప్తు సంస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించింది.
డిజిటల్ అరెస్ట్‌పై సీజేఐకి లేఖ
హర్యానాలోని అంబాలాకు చెందిన ఓ సీనియర్ సిటిజన్ జంట సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్‌కి డిజిటల్ అరెస్ట్‌పై ఫిర్యాదు చేస్తూ ఓ లేఖ రాసింది. గత నెల 1–16 మధ్య తమను సైబర్‌నేరగాళ్లు సుప్రీంకోర్టు పేరుతో ఉన్న పత్రాలు చూపుతూ అరెస్ట్ చేస్తామని బెదిరించారని పేర్కొన్నారు.
సీబీఐ, ఇంటెలిజెన్స్ బ్యూరో, న్యాయ అధికారుల అధికారులలాగా వీడియో కాల్స్ చేశారని, అరెస్టునుంచి తప్పిస్తామని చెప్పి రూ.1.05 కోట్లు కాజేశారని తెలిపారు. కోర్టు ఆదేశాలు ఇచ్చినట్లుగా నకిలీ పత్రాలు చూపించి సైబర్‌నేరగాళ్లు సొమ్ములు కాజేయడాన్ని సీజేఐతో సహా సీనియర్ న్యాయమూర్తులు తీవ్రంగా పరిగణించారు.
అంబాలా కేసును న్యాయస్థానం సుమోటోగా తీసుకోగా.. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ‘‘ఈ కేసుతోపాటు న్యాయపరంగా డిజిటల్ అరెస్టులను పరిశీలించాలనుకుంటున్నాం.
దేశంలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి నేరాలు జరుగుతున్నట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి. న్యాయపరమైన పత్రాలను ఫోర్జరీ చేస్తూ అమాయకులను దోచుకుంటున్నారు. అందుకే ఇలాంటి కేసులను సీరియస్‌గా పరిగణించాల్సిన అవసరం ఉందని కోర్టు భావిస్తున్నది’ అని బెంచ్ పేర్కొన్నది.
ఏడాదిలోనే వెయ్యికోట్లు మోసపోయిన ఢిల్లీవాసులు
సైబర్ నేరగాళ్లు ఢిల్లీవాసులను డిజిటల్ స్కామ్‌లతో భారీగా దోచుకున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే వెయ్యి కోట్లు కోల్పోయారు. ఇందులో ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్‌లు, డిజిటల్ అరెస్టులు, బాస్స్కామ్ల వంటివి అత్యంత సాధారణంగా మారాయని అధికారిక డేటాలో తేలింది.
2024లో డిజిటల్ స్కామ్‌లతో ఢిల్లీ వాసులు రూ. 1,100 కోట్లు కోల్పోగా.. అందులో సుమారు 10 శాతం మొత్తాన్ని అధికారులు బ్యాంకు ఖాతాల్లో హోల్డ్ చేయగలిగారు. ఈ మొత్తాన్ని కోర్టు ఆదేశాల తర్వాత బాధితులకు అందించనున్నారు. ఈ ఏడాది మోసపోయిన నిధుల్లో దాదాపు 20 శాతాన్ని హోల్డ్‌లో ఉంచగలిగారు. సైబర్ నేరం జరిగిన వెంటనే 1930కు కాల్ చేస్తే.. డబ్బును హోల్డ్ చేసే అవకాశం ఉంటుందని ఢిల్లీ డీసీపీ తెలిపారు.