హైదరాబాద్: మేడ్చల్ జిల్లా శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని అలియాబాద్ చౌరస్తా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అలియాబాద్ నుంచి శామీర్ పేట వైపు వెళ్తున్న ట్రాక్టర్‌ను శామీర్ పేట నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. ట్రాక్టర్ అదుపు తప్పి రాంగ్ రూట్లోకి వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో మహారాష్ట్రకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ ఆకాష్ (30) అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద ధాటికి ట్రాక్టర్ ఇంజన్ రెండు ముక్కలైంది. ఈ ప్రమాదంతో రాజీవ్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇరువైపుల కిలో మీటర్ల మేర
వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.
రోడ్డుకు అడ్డంగా ఉన్న ట్రాక్టర్‌ను క్రేన్ సహయంతో పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
