అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకెళ్లిన కారు వెనక నుంచి కంటైనర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఆరుగురు ఉన్నారు. ప్రమాదానికి గురైన కారు గుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలు ఆరా తీశారు. ఓవర్ స్పీడే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
