లోన్లు తీసుకోమంటరు.. మిత్తి పైసలు ఇస్తలే

లోన్లు తీసుకోమంటరు.. మిత్తి పైసలు ఇస్తలే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇస్తున్న బ్యాంకు లింకేజీ రుణాల లిమిట్ ను సెర్ప్ డబుల్ చేసింది. గతంలో రూ.5 లక్షలు, రూ.6 లక్షలు లోన్లు తీసుకుని రీపేమెంట్ చేసిన గ్రూపులు ఇప్పుడు ఒకేసారి రూ.10 లక్షలు లోన్ తీసుకునేలా నిబంధనలు సడలించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మార్చి నెలాఖరు నాటికి రూ.12,070 కోట్ల వడ్డీ లేని రుణాలివ్వాలని సెర్ప్ సిబ్బందికి, బ్యాంకర్లకు సర్కార్ టార్గెట్ విధించింది. ఈ మేరకు సెర్ప్ సీఈఓ, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా సోమవారం ఆదేశాలు జారీ చేశారు. అయితే లోన్లు ఇవ్వడం వరకు బాగానే  ఉన్నా గత రెండున్నరేళ్లుగా తాము బ్యాంకులకు అసలుతోపాటు చెల్లించిన వడ్డీని ప్రభుత్వం తిరిగివ్వడం లేదని మహిళా సంఘాల సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము పద్ధతిగా క్రమం తప్పకుండా కిస్తీ కడుతున్నామని.. సర్కార్ మాత్రం ఆ పద్ధతి పాటించడం లేదని విమర్శిస్తున్నారు. 

నిబంధనలు సడలింపు.. 

లోన్లు తీసుకున్న వ్యాపారులు, ఇతర సెక్షన్ల ప్రజలు చాలా మంది రీపేమెంట్ చేయకుండా డీఫాల్టర్స్ గా మారడం, వసూళ్లకు బ్యాంకు సిబ్బంది నోటీసుల మీద నోటీసులు పంపడం సర్వసాధారణమే. కానీ మహిళా సంఘాల సభ్యులు కిస్తీ చెల్లించాల్సిన తేదీకి ఒక రోజు ముందే అసలు, వడ్డీ కలిపి రీపేమేంట్ చేస్తుంటారు. 97 శాతం లోన్లు రికవరీ కావడం, బిజినెస్ బాగుండడంతో బ్యాంకర్లు కూడా వీళ్లకు ఎలాంటి ష్యూరిటీ లేకున్నా లక్షలాది రూపాయలు లోన్లు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. అందుకే ఈ సారి రాష్ట్రంలో ఈ ఏడాది 3,80,156 మహిళా గ్రూపులకు రూ.12,070 కోట్ల లోన్లు ఇవ్వాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈ నెల 14 నాటికి 4,833 స్వయం సహాయక సంఘాలకు రూ.168.81 కోట్ల రుణాలు మంజూరు చేశారు. రుణాలు ఎక్కువ గ్రూపులకు అందేలా చేయడం కోసం నిబంధనలు సడలించారు. ఈ మేరకు బ్యాంకర్లు, సెర్ప్ సిబ్బంది కోసం సంస్థ సీఈఓ సందీప్ కుమార్ సుల్తానియా గురువారం మార్గదర్శకాలు విడుదల చేశారు. 

  • కనీసం ఆరు నెలలు ఉనికిలో ఉండి, పంచసూత్రాలు పాటిస్తున్న సంఘాలకు లోన్లు ఇవ్వనున్నారు. కొత్త సంఘాలకు కనీస రుణం రూ.లక్షగా నిర్ణయించారు. రెండేళ్లు ఉనికిలో ఉన్న సంఘాలకు రూ.2 లక్షలు, అలాగే మూడేళ్ల సీనియార్టీ ఉన్న సంఘాలకు రూ.6 లక్షల వరకు లోన్ ఇవ్వనున్నారు. 
  • అలాగే నాలుగేళ్లు దాటిన సంఘాలకు రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు లోన్ ఇవ్వాలని గైడ్ లైన్స్ లో పేర్కొన్నారు. గతంలో రూ.7.50 లక్షల లోన్ తీసుకుని రీపేమెంట్ చేస్తేనే రూ.10 లక్షల లోన్ ఇచ్చేవారు. కానీ ఈ సారి రూ.5 లక్షలు, రూ. 6 లక్షలు లోన్ తీసుకున్న గ్రూపులకు కూడా రూ.10 లక్షల లోన్ ఒకేసారి ఇచ్చే అవకాశం కల్పించారు. 
  • లోన్ తీసుకున్న సంఘాలు మళ్లీ లోన్ తీసుకునే వెసులుబాటు కూడా కల్పించారు. ఉదాహరణకు ఏ గ్రూపయినా గత ఏడాది రూ.6 లక్షల లోన్ తీసుకుని ఇప్పటికే రూ.1 లక్ష లేదా రూ.2 లక్షలు రీపేమెంట్ చేసి ఉంటే..ఆ మొత్తాన్ని మళ్లీ లోన్ గా తీసుకునే అవకాశమిచ్చారు.

బడ్జెట్‌‌లో కేటాయించారు.. వడ్డీ చెల్లించడం మరిచారు.. 

మహిళా స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర సర్కార్ రూ.3 వేల కోట్లకుపైగా బాకీ పడింది. మహిళలు తీసుకున్న లోన్లపై బ్యాంకు ఆఫీసర్లు నెలనెలా మిత్తీని బరాబర్ వసూలు చేస్తున్నప్పటికీ.. ప్రభుత్వం మాత్రం రెండున్నరేండ్లుగా ఆ డబ్బులను మహిళలకు తిరిగి చెల్లించడం లేదు. 2021 – 22 బడ్జెట్ లో వడ్డీ లేని రుణాల వడ్డీని చెల్లించేందుకు ప్రభుత్వం రూ.3 వేల కోట్లు కేటాయించింది. కానీ ఇటీవల కేవలం రూ.200 కోట్లు మాత్రమే విడుదల చేసింది. లోన్లు తీసుకున్న మహిళ సంఘాలు ప్రతి నెలా కిస్తీ చెల్లించాల్సిన తేదీకి ఒక్క రోజు లేటైనా.. ఆ నెల వడ్డీని తాము చెల్లించాల్సిన వడ్డీగా ప్రభుత్వం పరిగణించడం లేదు. ఏదైనా మహిళా సంఘం బ్యాంకులో ఇన్ టైంలో కిస్తీ చెల్లిస్తేనే ఆ నెల వడ్డీని ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీగా లెక్కగడుతున్నారు. ఏ నెలలో కిస్తీని సకాలంలో చెల్లించకపోతే ఆ నెల వడ్డీని కోల్పోవాల్సి వస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళల విషయంలో మాత్రం రూల్స్‌‌ను కచ్చితంగా అమలు చేస్తున్న ప్రభుత్వం.. వారి ఖాతాల్లో వడ్డీని జమ చేయడంలో మాత్రం జాప్యం చేస్తోంది.