బాలికల చదువు కోసం సేవా కార్యక్రమాలు: అల్లు అర్జున్

బాలికల చదువు కోసం సేవా కార్యక్రమాలు: అల్లు అర్జున్

హాలియా, వెలుగు: నాగార్జునసాగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి చేస్తున్న సేవలు అభినందనీయమని ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ అన్నారు. శనివారం పెద్దవూర మండలంలోని కంచర్ల వ్యవసాయ క్షేత్రంలో నిర్మించిన కంచర్ల కన్వెన్షన్ సెంటర్​ను చంద్రశేఖర్ రెడ్డితో కలిసి ప్రారంభించి మాట్లాడారు. సాగర్ అభివృద్ధి కోసం మామయ్య చంద్రశేఖర్ రెడ్డి కృషి చేస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న బాలికలకు పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతున్నదన్నారు. 

సాగర్ ప్రజల మేలు కోసమే కంచర్ల కన్వెన్షన్ ప్రారంభించారని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా అన్ని రకాల వసతులు ఇందులో కల్పించారని వివరించారు. సాగర్ ప్రజల కోసం చేస్తున్న కృషిలో తాను పాలుపంచుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. తర్వాత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో నాగార్జునసాగర్ నియోజకవర్గం బాగా వెనుకబడి ఉందన్నారు. బీఆర్ఎస్ అవకాశం ఇస్తే సాగర్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నంబర్ వన్ స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తానని చెప్పారు. రాజకీయంగా ఈ నియోజకవర్గంతో తనకున్న సంబంధాలను కొనసాగించేందుకు వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేపడుతున్నానని వివరించారు. 

బాలికల చదువులు మధ్యలోనే ఆగిపోవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదువుతున్న వారికి ఫ్రీగా స్టడీ మెటీరియల్ అందజేస్తున్నానని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు, పార్టీ కార్యకర్తల మద్దతు తనకు లభిస్తే కచ్చితంగా సాగర్ అభివృద్ధికి పాటుపడతానని చెప్పారు. అల్లు అర్జున్ వస్తున్నాడని తెలిసి సాగర్, నల్గొండ, మునుగోడు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ రెడ్డి, కొడుకు, కూతురు అల్లు ఆర్య, అర్హ, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పెద్ద అల్లుడు, గ్యాస్ట్రోలజిస్ట్ డాక్టర్ కె.రఘు, భార్య అరుణ, ఐపీఎస్ అధికారి అనురాధ, మంత్రి జగదీశ్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, పెద్దవూర మండల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.