హుజూరాబాద్ ​కేంద్రంగా సెటిల్​మెంట్లు

హుజూరాబాద్ ​కేంద్రంగా సెటిల్​మెంట్లు
  • పోలీస్​స్టేషన్లలో గన్నులతో హల్​చల్​
  • పార్టీలోనూ వన్​ మ్యాన్​ షో
  • హైకమాండ్​కు ఫిర్యాదులు

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్​ కేంద్రంగా ఎమ్మెల్సీ కౌశిక్​ అండ్​ గ్యాంగ్​ తీరు తీవ్ర వివాదాస్పదవుతున్నది. ఆయన అనుచరులు బొడ్లో గన్నులు పెట్టుకొని తిరుగుతున్న ఫొటోలు ఆమధ్య బయటకు వచ్చాయి. అది మరచిపోకముందే హనుమకొండ, దాని చుట్టుపక్కల ఏరియాల్లో కౌశిక్​ గ్యాంగ్​ చేస్తున్న ల్యాండ్​సెటిల్​మెంట్లపై రోజుకో కొత్తవిషయం వెలుగుచూస్తోంది. ఇటీవల ఓ పంచాయతీ సెటిల్ మెంట్ కోసమని వచ్చిన కౌశిక్​ అనుచరులు ఏకంగా హుజూరాబాద్  ఏసీపీ ఆఫీస్ లో హల్​చల్​ చేయడం కలకలం రేపింది. ఇది చాలదన్నట్లు ఇటు పార్టీలో, అటు పాలనలో కౌశిక్​ వన్​మ్యాన్​షోపై హైకమాండ్​కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈక్రమంలో ఇటీవల వరంగల్​ పర్యటన సందర్భంగా కౌశిక్​కు సీఎం కేసీఆర్​క్లాస్​ తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 

గన్నుల లొల్లి మరవకముందే సెటిల్​మెంట్లు.. 

హుజూరాబాద్‍ నియోజకవర్గంలో ఇప్పటికే ఐదుగురికి లైసెన్స్‌డ్​వెపన్స్​ఉండగా ఇటీవల  మరో ఇద్దరికి గన్​ లైసెన్స్ ఇచ్చారు.  ఆ ఇద్దరూ కౌశిక్​ అనుచరులే కావడం గమనార్హం. ఆమధ్య జయశంకర్‍ జయంతి వేడుకల్లో కౌశిక్​ అనుచరుడొకరు అందరికీ కనిపించేలా బొడ్లో  గన్​పెట్టుకుని వచ్చి షో చేశాడు. దీంతో వారి ఆగడాలు ఒక్కొక్కటే బయటకు వచ్చాయి. పోలీస్​స్టేషన్లలోనే టేబుల్​పై గన్స్​పెట్టి ల్యాండ్, ఇతర సివిల్​కేసుల సెటిల్​మెంట్లు చేస్తున్న విషయం బయటపడింది.  ఇటీవల హుజూరాబాద్​కు చెందిన ఓ  సీడ్‍ వ్యాపారికి సంబంధించిన లావాదేవీల విషయంలో కలుగచేసుకొని ఏసీపీ ఎదుటే గన్​తో షో చేసి, బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. -కౌశిక్ రెడ్డి వర్గీయులు ఈమధ్యే పరకాల ఏరియాలో ఒక ల్యాండ్ సెటిల్​మెంట్​లో ఇన్వాల్వ్ అయినట్లు తెలిసింది. ఈ విషయం హైకమాండ్​దాకా వెళ్లింది. ఇది మరిచిపోకముందే ఇల్లందకుంట మండలంలో ఓ భార్యాభర్తల గొడవలో తలదూర్చడంతో దుమారం రేగింది. ఇల్లందకుంట పోలీస్ స్టేషన్​ను అడ్డాగా చేసుకొని అక్కడి కౌశిక్​ అనుచరుడొకరు చేస్తున్న ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. వీళ్ల టార్చర్​ భరించలేక ఇప్పటికే ముగ్గురు ఎంపీడీవోలు ట్రాన్స్​ఫర్​ చేసుకొని వెళ్లిపోయారు. ప్రస్తుత తహసీల్దార్​ కూడా ఇక్కడ పనిచేయలేనని, తనను వేరే చోటుకు ట్రాన్స్​ఫర్​ చేయాలని కలెక్టర్​ను వేడుకున్నట్లు తెలిసింది.  కౌశిక్ అనుచరుడు హనుమకొండలోని ఓ  ల్యాండ్​ ఇష్యూ లో ఎంటర్ కాగా, అక్కడి ఓ ఎమ్మెల్యే అడ్డుకొని హైకమాండ్​కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. హనుమకొండ చుట్టుపక్కల గ్రామాల్లో భూముల రేట్లు కోట్లలో పలుకుతుండడంతో కౌశిక్,​ ఆయన అనుచరులు ల్యాండ్​ సెటిల్మెంట్లలో తలదూరుస్తున్నారని, గన్​లతో బెదిరిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో పోలీస్​అధికారులు ఇటీవల ఇద్దరి  గన్​ లైసెన్స్ లు రద్దు చేశారు. కానీ ఎమ్మెల్సీ కౌశిక్​రెడ్డి సాయంతో మరోసారి లైసెన్స్​లు తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. హుజూరాబాద్​లో గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో  గన్​కల్చర్, గూండాగిరీ పెరిగిపోవడంపై సామాన్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నది.  

ముందు డీజే.. వెనుక పోలీస్​ ఎస్కార్ట్​

కౌశిక్‍ రెడ్డి టీఆర్ఎస్​లో చేరి ఎమ్మెల్సీ అయ్యాక హుజూరాబాద్‍ నియోజకవర్గంలో వన్​మ్యాన్​షో నడిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కౌశిక్​రెడ్డి మండలాల పర్యటనకు వస్తే ముందు డీజే, అందులో కౌశిక్​ పాటలు, వెనుక పోలీస్​ఎస్కార్ట్ వాహనం వస్తాయంటే ఆయన ఏ రేంజ్​లో హవా కొనసాగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. బీజేపీకి చెందిన ఈటల రాజేందర్​ఎమ్మెల్యేగా ఉండడంతో అక్కడ ఎమ్మెల్సీ చెప్పినదానికే ప్రియారిటీ ఇవ్వాలని సర్కారు పెద్దల నుంచి అటు అధికారులకు, ఇటు పోలీసులకు మౌఖిక ఆదేశాలున్నాయి. దీనిని ఆసరాగా తీసుకొని ఎమ్మెల్సీ, ఆయన అనుచరులు రెచ్చిపోతున్నారనే టాక్​ నడుస్తోంది. ఎమ్మెల్యేకు సమాచారం లేకుండా అధికారిక కార్యక్రమాలను, టీఆర్ఎస్​నియోజకవర్గ ఇన్​చార్జిగా ఉన్న గెల్లు శ్రీనివాస్​కు  సంబంధం లేకుండా పార్టీ కార్యకలాపాలను అన్నీ తానై నడిపిస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలో కౌశిక్​, ఆయన అనుచరులు అధికారులు, పోలీసులను అడ్డం పెట్టుకొని అరాచకాలు సాగిస్తున్నారని, పార్టీలో సీనియర్​ నేతలను కూడా పట్టించుకోవడం లేదని హైకమాండ్​కు లోకల్​ లీడర్లు ఫిర్యాదు చేసినట్లు చర్చ జరుగుతోంది.