యువత ఉపాధికి సెట్ విన్ బాట.. ప్రతి నియోజకవర్గంలో సెంటర్ ఏర్పాటు..!

యువత ఉపాధికి సెట్ విన్ బాట.. ప్రతి నియోజకవర్గంలో సెంటర్ ఏర్పాటు..!
  • నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణే లక్ష్యంగా ముందుకు 
  • రూ.3 కోట్లతో ఒక్కో కేంద్రం 
  • జాబ్ ఒరియెంటెడ్ కోర్సులపై శిక్షణ 
  • కోర్సు పూర్తికాగానే బ్యాంకు లోన్లు, సబ్సిడీలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలు రూపొందిస్తోంది. కేవలం డిగ్రీలు, పట్టా సర్టిఫికెట్లతో సరిపెట్టుకోకుండా వారిలో నైపుణ్యాన్ని పెంపొందించి ఉపాధికి బాటలు వేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే సెట్ విన్ (సొసైటీ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ ప్రమోషన్ అండ్ ట్రైనింగ్ ఇన్ ట్విన్ సిటీస్) సంస్థను మరింత బలోపేతం చేస్తోంది. ఇప్పటివరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాలకే పరిమితమైన ఈ సేవలను రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

టీ–హబ్ మోడల్‌లో శిక్షణ కేంద్రాలు

రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక సెట్ విన్  కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఈ సెంటర్లను టీ–హబ్ మోడల్‌లో అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దనున్నారు. ఒక్కో కేంద్రం ఏర్పాటుకు సుమారు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం. ఈ ప్రణాళిక కార్యరూపం దాలిస్తే, నిరుద్యోగ యువతకు స్థానికంగానే అత్యుత్తమ శిక్షణ లభిస్తుంది. 

ప్రస్తుతం సెట్ విన్  ద్వారా మార్కెట్  డిమాండ్‌కు అనుగుణంగా 59 రకాల వృత్తివిద్యా కోర్సులను అందిస్తున్నారు. ఆటోక్యాడ్, సోలార్  ప్యానెల్ ఇన్‌స్టలేషన్, మొబైల్  సర్వీసింగ్, సీసీటీవీ కెమెరా రిపేరింగ్, హార్డ్‌వేర్  అండ్​ నెట్‌వర్కింగ్, ట్యాలీ, స్పోకెన్  ఇంగ్లిష్  వంటి జాబ్ ఒరియెంటెడ్  కోర్సులపై శిక్షణ ఇస్తున్నారు.  ప్రైవేట్  సంస్థలతో పోలిస్తే చాలా తక్కువ ఫీజు రూ.1,000 నుంచి రూ.5,000 మధ్య ఉంటుందని ఆఫీసర్లు చెప్తున్నారు. మురికివాడల్లో ఉండేవారికి ఫీజులో 50 శాతం రాయితీ కల్పిస్తూ పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు. 

9 జిల్లాలు, జీహెచ్ఎంసీ పరిధిలో 31 కేంద్రాలు 

శిక్షణ ఇచ్చి వదిలేయకుండా కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు సొంతంగా యూనిట్లు పెట్టుకునేందుకు సెట్ విన్  సహకారం అందిస్తోంది. బ్యాంకుల ద్వారా  రుణాలను ఇప్పించడంతో పాటు ప్రభుత్వ సబ్సిడీలు అందేలా చూస్తోంది. దీనివల్ల యువత ఉద్యోగాల కోసం వెతకడమే కాకుండా పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతారని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 31 సెట్ విన్  కేంద్రాలు నడుస్తున్నాయి. 

జీహెచ్ఎంసీ పరిధిలో చైతన్యపురి, అంబేద్కర్  నగర్, ఏజీ గార్డ్స్, ఎర్రగడ్డ, ముషీరాబాద్, యూసుఫ్ గూడ, మంగళ్ హట్ సహా 22 ప్రాంతాల్లో శిక్షణ కొనసాగుతోంది. సిద్దిపేట, కామారెడ్డి, గజ్వేల్, డిచ్‌పల్లి, నల్గొండ, మహబూబ్‌నగర్, జహీరాబాద్, జడ్చర్ల, హుస్నాబాద్ లో కేంద్రాలు ఉన్నాయి. వీటితో పాటు మరో 47 ఫ్రాంచైజీ కేంద్రాల ద్వారా కూడా సేవలు అందుతున్నాయి. 

రికార్డు స్థాయిలో అభ్యర్థుల నమోదు

సెట్ విన్  అందిస్తున్న శిక్షణకు యువత నుంచి భారీగా స్పందన లభిస్తోంది. 2025–-26 ఆర్థిక సంవత్సరంలో (ఫిబ్రవరి 2026 నాటికి) సుమారు 16,814 మంది అభ్యర్థులు వివిధ కోర్సుల్లో చేరినట్లు లెక్కలు చెబుతున్నాయి. దీని ద్వారా సంస్థకు రూ.2.79 కోట్ల ఆదాయం లభించింది. నియోజకవర్గాల వారీగా కొత్త కేంద్రాలు ఏర్పాటైతే ఏటా లక్షలాది మందికి లబ్ధి చేకూరనుంది. ఇక, అన్ని జాబ్ ఒరియెంటెడ్  కోర్సులను నిర్వహిస్తున్నారు.

ప్రైవేటు సంస్థల కన్నా తక్కువ ఫీజుతో శిక్షణ ఇస్తున్నారు. అధికంగా డిమాండ్‌  ఉన్న పలు రకాల కోర్సుల్లో అవసరమైన మెళకువలను నేర్పేందుకు నిష్ణాతులైన ఫ్యాకల్టీలతో శిక్షణ ఇప్పించేలా ప్లాన్​ చేస్తున్నారు. మారుతున్న సాంకేతిక నైపుణ్యభివృద్ధిని యువతకు అందించేందుకు సెట్ విన్‌  కృషి చేస్తుందని ఆఫీసర్లు పేర్కొన్నారు.