- ములుగు జిల్లాలో అత్యధికంగా 139 సెంటీ మీటర్లు
- రాష్ట్రవ్యాప్తంగా 80 సెంటీ మీటర్లు నమోదు
- సంగారెడ్డి మినహా రాష్ట్రమంతటా సగటు కంటే ఎక్కువ వానలు
- కరువు జిల్లా పాలమూరులోనూ రికార్డు స్థాయిలో వర్షాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదైంది. ఒక్క సంగారెడ్డి తప్ప అన్ని జిల్లాల్లోనూ సీజన్ సగటు కంటే ఎక్కువ వర్షాలు కురిశాయి. మరో నెల పాటు వానాకాలం ఉండటంతో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని అధికారులు చెప్తున్నారు. ఈ సీజన్లో ఇప్పటిదాకా ఏడు జిల్లాల్లో 100 సెంటీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. పలు డిస్ట్రిక్స్‌లో ఆయా జిల్లాల సగటు వర్షపాతంతో పోలిస్తే 90 నుంచి వంద శాతం అధిక వర్షాలు కురిశాయి.
ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కుమ్రంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో వంద సెంటీ మీటర్లకు పైగా వర్షపాతం రికార్డయింది. ములుగు జిల్లాలో అత్యధికంగా 139 సెంటీ మీటర్ల వర్షం పడింది. ఆ జిల్లా సగటు వర్షపాతం 82.20 సెంటీ మీటర్లు కాగా.. 69% అధిక వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్ జిల్లా సగటు వర్షపాతం 70.90 సెంటీ మీటర్లు కాగా, 56 శాతం అధికంగా 110.70 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 78.88 సెంటీ మీటర్లకు గాను 40 శాతం ఎక్కువగా 110 సెంటీ మీటర్లు, జయశంకర్ భూపాలపల్లిలో 82.54 సెంటీ మీటర్ల సగటు వర్షపాతానికిగానూ.. 25 శాతం అధికంగా 103.50 సెంటీ మీటర్ల వర్షం పడింది.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 82.94 సెంటీ మీటర్ల వర్షపాతానికిగానూ.. 22 శాతం ఎక్కువగా 101.40 సెంటీ మీటర్లు, పెద్దపల్లిలో 71.90 సెంటీ మీటర్లకుగాను.. 41 శాతం అధికంగా 101.20 సెంటీ మీటర్ల వర్షం పడింది. జగిత్యాలలో 66.30 సెంటీ మీటర్లకు గాను 51 శాతం అధికంగా 100 సెంటీ మీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది.
నారాయణపేటలో సగటు కంటే 122 శాతం ఎక్కువ వానలు
కరువు జిల్లాగా పేరుపడిన ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. ఆయా జిల్లాల సగటుతో పోలిస్తే దాదాపు వంద శాతం అధిక వర్షపాతం నమోదైంది. పర్సంటేజీ పరంగా చూస్తే రాష్ట్రంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే సగటు వర్షపాతం అధికంగా నమోదైంది. అత్యధికంగా నారాయణపేట జిల్లాలో సగటు వర్షపాతం కన్నా 122 శాతం ఎక్కువ వర్షం పడింది. ఆ జిల్లాలో 35.26 సెంటీ మీటర్ల వర్షపాతానికిగానూ 78.32 సెంటీ మీటర్ల వర్షం పడింది. నాగర్‌కర్నూలు జిల్లాలో 36.14 సెంటీ మీటర్లకు గాను.. 97 శాతం అధికంగా 71.22 సెంటీ మీటర్ల వర్షం కురిసింది.
మహబూబ్‌నగర్‌లో 39.23 సెంటీ మీటర్ల వర్షపాతానికిగానూ 90 శాతం ఎక్కువగా 74.73 సెంటీ మీటర్లు, జోగులాంబ గద్వాలలో 33.63 సెంటీ మీటర్లకు గానూ 69 శాతం ఎక్కువగా 56.80 సెంటీ మీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది. సంగారెడ్డి జిల్లాలో అత్యల్పంగా సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది. ఆ జిల్లా సగటు వర్షపాతం 55.99 సెంటీ మీటర్లు కాగా, 52.20 సెంటీ మీటర్ల వర్షపాతమే నమోదైంది. ఇది సగటు వర్షపాతం కన్నా 7 శాతం తక్కువ. ఆ ఒక్క జిల్లాలోనే సాధారణంతో పోలిస్తే మైనస్‌లో వర్షపాతం రికార్డయింది.
రాష్ట్రవ్యాప్తంగా 80 సెంటీ మీటర్ల వర్షం
సెప్టెంబర్ లోనూ రాష్ట్రవ్యాప్తంగా దండిగా వానలు పడ్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. సెప్టెంబర్ నెలకు సంబంధించి వర్షాలపై ఐఎండీ మంగళవారం బులెటిన్ విడుదల చేసింది. పసిఫిక్‌లో ఎల్‌నినో న్యూట్రల్ కండిషన్స్ ఉండడం, హిందూ మహాసముద్రంలో పాజిటివ్ డైపోల్ ఉండడంతో ఈ నెలంతా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది. సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు మినహా రాష్ట్రమంతటా ఆ నెలలో సాధారణం కన్నా ఎక్కువ వర్షాలే కురుస్తాయని తెలిపింది.
ఆ నాలుగు జిల్లాల్లో మాత్రం సెప్టెంబర్ నెలలో సాధారణం కన్నా తక్కువ కురుస్తాయని వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో వర్షపాత సగటు మరింత పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఇప్పటిదాకా రాష్ట్రవ్యాప్తంగా సగటు వర్షపాతం 59.29 సెంటీ మీటర్లు అయితే.. 36 శాతం అధికంగా 80.39 సెంటీ మీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది. ఈ నెలలో కురిసే వర్షంతో అది మరింత పెరిగే అవకాశం లేకపోలేదని అధికారులు అంటున్నారు. రాష్ట్ర సగటు వర్షపాతం వంద సెంటీ మీటర్ల వరకు నమోదైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్తున్నారు.
నేడు ఐదు జిల్లాలకు ఎల్లో అలర్ట్
రాష్ట్రంలో బుధవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఐదు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. మిగతా జిల్లాల్లోనూ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈదురుగాలుల ప్రభావం ఉండొచ్చని పేర్కొన్నది. హైదరాబాద్ సిటీలో రెండ్రోజుల పాటు మబ్బులు పట్టి ఉంటుందని, తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కాగా, మంగళవారం ఆదిలాబాద్, కుమ్రంభీం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.
నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, గద్వాల, యాదాద్రి భువనగిరి, జనగామ, వరంగల్, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి. అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు, ఆదిలాబాద్ జిల్లా నామూరులలో 8.6 సెంటీ మీటర్ల చొప్పున వర్షం పడింది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో 5.3, ఉట్నూరులో 5.1, సిద్దిపేట జిల్లా లకుడారంలో 4.7, కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటలో 4.1 వర్షం కురిసింది. హైదరాబాద్‌లో తేలికపాటి జల్లులు పడ్డాయి.