- హనుమకొండలో దాచిన వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు
హనుమకొండ సిటీ/పర్వతగిరి(సంగెం), వెలుగు: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధితోపాటు హైదరాబాద్ లో బైక్‌లు చోరీ చేస్తున్న ఏడుగురిని హనుమకొండ జిల్లా సంగెం పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను వరంగల్ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్ కుమార్ వెల్లడించారు. హనుమకొండకు చెందిన దరాంగుల అంజి, వరంగల్ ఉర్సుకు చెందిన సంతోష్, కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన జైదా రామకృష్ణ, నలుగురు మైనర్లు ఒకే ప్రాంతంలో నివాసం ఉండటంతో వారి మధ్య స్నేహం ఏర్పడింది.
జల్సాలకు అలవాటు పడి, సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నారు. ఇందుకోసం పార్క్చేసిన బైక్‌లను చోరీ చేయాలన్న నిర్ణయానికొచ్చారు. సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో 5, సంగెం, హసన్‌పర్తి, మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్ల పరిధిలో 6, హనుమకొండ, ధర్మసాగర్ పోలీస్ స్టేషన్లపరిధిలో 2, హైదరాబాద్ మడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2 ద్విచక్ర వాహనాలను చోరీ చేశారు. వాటిని హనుమకొండ పద్మాక్షమ్మ గుట్ట ప్రాంతంలో దాచారు. ఈ నెల 1న సంగెం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆశాలపల్లిలో టూవీలర్‌ను చోరీ చేయగా.. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
టెక్నాలజీని ఉపయోగించుకొని, ప్రత్యేక బృందాల గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం గవిచర్లలో వాహనాల తనిఖీ చేస్తుండగా రెండు బైక్‌లపై వెళ్తూ అనుమానాస్పదంగా కనిపించిన ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ తెలిపారు. విచారణలో బైక్‌లు చోరీ చేస్తున్నట్లు వారు ఒప్పుకున్నారని చెప్పారు. వాహనాలను స్వాధీనం చేసుకొని, నిందితులను అరెస్ట్‌చేసినట్లు పేర్కొన్నారు. వారిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన మామునూరు ఏసీపీ వెంకట్, పర్వతగిరి సీఐ రాజగోపాల్, సీసీఎస్ ఇన్స్‌స్పెక్టర్ రాఘవేందర్, సంగెం ఎస్సై వంశీకృష్ణ, సిబ్బందిని అభినందించారు.
