ఈ వారం 7 ఐపీఓలు.. వీటిలో 4 ఎస్​ఎంఈలు

ఈ వారం 7 ఐపీఓలు.. వీటిలో 4 ఎస్​ఎంఈలు

ముంబై: దలాల్​​స్ట్రీట్​లో ఈ వారం ఏకంగా ఏడు ఐపీఓలు సందడి చేయనున్నాయి. ప్రస్తుత సంవత్సరం మొదటి అర్ధభాగంలో పెద్దగా పబ్లిక్​ ఇష్యూలు రాలేదు.  జూన్​ నుంచి మాత్రం ఐపీఓ స్ట్రీట్​లో హడావుడి  కనిపిస్తోంది. ఈ  వారంలో ఇన్వెస్టర్ల ముందుకు రాబోతున్న ఏడు పబ్లిక్ ఇష్యూల్లో మూడు 3 పెద్ద​ కంపెనీలు ఉండగా, మిగతావి ఎస్​ఎంఈలు. 

ఐడియాఫోర్జ్

ఐడియాఫోర్జ్ ఐపీఓకు  భారీగా డిమాండ్ ​ఉండొచ్చని ఎనలిస్టులు చెబుతున్నారు. ఈ ఐపీఓ సోమవారం మొదలవుతుంది. ఇదే నెల 29న ముగుస్తుంది. ఐపీఓలో రూ. 240 కోట్ల వరకు ఈక్విటీ షేర్ల ఫ్రెష్​ ఇష్యూ ఉంటుంది. 48.6 లక్షల షేర్ల వరకు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్​ఎస్​) ఉంటుంది.  ప్రైస్ బ్యాండ్​ను ఒక్కో షేరుకు రూ.638-–672గా నిర్ణయించారు. కంపెనీ దాదాపు రూ.567 కోట్లను సమీకరించాలని యోచిస్తోంది. ఐడియాఫోర్జ్​  ప్రధానంగా నిఘా, మ్యాపింగ్,  సర్వేయింగ్ కోసం అప్లికేషన్‌‌‌‌లను అందిస్తుంది. దీని కస్టమర్లలో సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్ట్ర పోలీసు విభాగాలు, విపత్తు నిర్వహణ దళాలు,  అటవీ శాఖలు, ఇతర కస్టమర్లు ఉన్నారు.

పీకేహెచ్​ వెంచర్స్

పీకేహెచ్​ వెంచర్స్ పబ్లిక్​ ఇష్యూ జూన్ 30న మొదలై జూలై 4న ముగుస్తుంది.  షేర్ల ధరల వివరాలను త్వరలో ప్రకటిస్తారు. ఐపీఓలో 1.82 కోట్ల షేర్ల ఫ్రెష్​ ఈక్విటీ ఇష్యూ ఉంటుంది.  73.7 లక్షల వరకు ఈక్విటీ షేర్ల ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్​ఎస్​) ఉంటుంది. ఓఎఫ్​ఎస్​ కింద, ప్రమోటర్ ప్రవీణ్ కుమార్ అగర్వాల్ 73.7 లక్షల ఈక్విటీ షేర్లను అమ్ముతారు. పీకేహెచ్​ వెంచర్స్ కన్​స్ట్రక్షన్ ​ డెవెలప్​మెంట్​, ఆతిథ్యం,  నిర్వహణ సేవల వ్యాపారంలో ఉంది. ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్స్ ఈ ఇష్యూకి బుక్-రన్నింగ్ లీడ్ మేనేజర్‌‌‌‌గా ఉండగా, లింక్ ఇన్‌‌‌‌టైమ్ ఇండియా రిజిస్ట్రార్‌‌‌‌గా వ్యవహరిస్తోంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ దాదాపు రూ.380 కోట్లు సమీకరించే అవకాశం ఉంది.

ఎస్​ఎంఈ ఐపీఓలు

ఎస్​ఎంఈ రంగానికి నాలుగు కంపెనీలు ఈ వారమే తమ పబ్లిక్ ఇష్యూలను తీసుకువస్తాయి. ఇవి మొత్తం రూ. 107 కోట్లను సేకరిస్తాయి. రబ్బర్ కన్వేయర్ బెల్ట్‌‌‌‌లు, ట్రాన్స్‌‌‌‌మిషన్ బెల్ట్‌‌‌‌లతో సహా పలు రకాల బెల్ట్‌‌‌‌లను తయారు చేసే పెంటగాన్ రబ్బర్  ఐపీఓ జూన్ 26న మొదలై జూన్ 30న ముగుస్తుంది. ఇది  రూ.10 ముఖ విలువ కలిగిన 23.1 లక్షల ఈక్విటీ షేర్ల ఫ్రెష్​ ఈక్విటీ ఇష్యూ. దీని ప్రైస్ బ్యాండ్​ను ఒక్కో షేరుకు రూ.65-–70గా నిర్ణయించారు. కంపెనీ దాదాపు రూ.16 కోట్లను సమీకరించనుంది.

గ్లోబల్ పెట్ ఇండస్ట్రీస్

పెట్ స్ట్రెచ్ బ్లో మోల్డింగ్ మెషీన్‌‌‌‌లను తయారు చేసి ఎగుమతి చేసే గ్లోబల్ పెట్ ఇండస్ట్రీస్, జూన్ 29న తన ఐపీఓని తీసుకువస్తోంది. ఒక్కో షేరుకు రూ. 49  ప్రైస్ బ్యాండ్ ఉన్న ఈ ఆఫర్ జూన్ 29న ముగుస్తుంది.  ఫ్రెష్​ఇష్యూ ద్వారా కంపెనీ 27 లక్షల షేర్లు అమ్మి దాదాపు రూ. 13 కోట్లను సేకరించనుంది.

త్రిధ్య టెక్  టెక్నాలజీస్

త్రిధ్య టెక్  టెక్నాలజీస్  ఐపీఓ జూన్ 30న ప్రారంభమై జూలై 5న ముగియనుంది. ఇది ఫుల్​సర్వీస్​ సాఫ్ట్‌‌‌‌వేర్ డెవలప్​మెంట్​ సంస్థ. ఇందులో అన్ని ఐటీ సేవలు, రిసోర్సులు ఉన్నాయి. షేర్ల ప్రైస్​ బ్యాండ్​ను రూ. 35-–42 మధ్య నిర్ణయించింది. అప్పర్​ఎండ్​ ప్రకారం ఇది దాదాపు 26.4 కోట్లును సేకరించనుంది.

సినాప్టిక్స్​ టెక్నాలజీస్​

బ్రాంచ్​లకు కనెక్టివిటీ, సరఫరా, అమలు, నెట్​వర్క్​ ఎక్విప్​మెంట్​కు సపోర్ట్​ వంటి ఐటీ మౌలిక సదుపాయాలను, పరిష్కారాలను అందించే ఐటీ సేవల సంస్థ సినాప్టిక్స్ ​టెక్నాలజీస్​. ఒక్కో షేరు ధర ను రూ.237 గా నిర్ణయించగా, దాదాపు రూ.54 కోట్లు రాబట్టనుంది.

సైయెంట్ డీఎల్​ఎం

సైయెంట్  అనుబంధ సంస్థ సైయెంట్ డీఎల్​ఎం కూడా ఐపీఓకు రెడీ అయింది. ఇష్యూ జూన్ 27న ప్రారంభమై జూన్ 30న ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్ల సబ్‌‌‌‌స్క్రిప్షన్ జూన్ 26న ఓపెన్​ అవుతుంది. భద్రతాపరంగా -క్లిష్టమైన విభాగాల కోసం అత్యంత సంక్లిష్టమైన, లో-వాల్యూమ్ ఎలక్ట్రానిక్స్​ పరికరాలను ఈ కంపెనీ  తయారు చేస్తుంది. ఈ కంపెనీ గతేడాది ఆంథోనీ మోంటల్‌‌‌‌బానోను సీఈఓగా నియమించింది. ఐపీఓలో రూ.592 కోట్ల ఫ్రెష్​ ఇష్యూ ఉంటుంది. ఒక్కో షేరు ధర రూ.250–-265 మధ్య ఉంటుంది.  యాక్సిస్ క్యాపిటల్, జేఎం ఫైనాన్షియల్ ఇష్యూకి బుక్-రన్నింగ్ లీడ్ మేనేజర్లు కాగా, కెఫిన్​ టెక్నాలజీస్ రిజిస్ట్రార్‌‌‌‌గా పనిచేస్తుంది.