ముగ్గురు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్

ముగ్గురు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్

19 మంది విపక్ష రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్​ వేటు పడింది. నిరసనలతో గందరగోళం సృష్టిస్తూ, సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారంటూ వారందరిపై ఈమేరకు చర్యలకు ఎగువసభ తీర్మానించింది. వారం రోజుల పాటు 19 మంది సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు రాజ్యసభ డిప్యూటీ  చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ప్రకటించారు. రాజ్యసభ నుంచి సస్పెండ్ అయిన వారిలో టీఆర్ఎస్ ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావు  కూడా ఉన్నారు.  సస్పెండ్ అయిన రాజ్యసభ సభ్యుల్లో తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఏడుగురు, డీఎంకేకు చెందిన ఆరుగురు, సీపీఎంకు చెందిన ఇద్దరు,  సీపీఐకి చెందిన ఒక  ఎంపీ ఉన్నారు. 

పార్లమెంటులో ప్లకార్డులతో నిరసన తెలిపిన నలుగురు కాంగ్రెస్ లోక్ సభ ఎంపీలను సస్పెండ్ చేసిన మరుసటి రోజే ఈమేరకు రాజ్యసభలోనూ పలువురు విపక్ష ఎంపీలపై చర్యలు తీసుకోవడం గమనార్హం. ఆగస్టు 12వ తేదీ వరకు లోక్ సభ వర్షాకాల సమావేశాలు కొనసాగనున్నాయి. సస్పెన్షన్ వేటుపడిన నలుగురు కాంగ్రెస్ ఎంపీలు లోక్ సభ సెషన్ ముగిసేవరకు హాజరుకావడానికి వీలు ఉండదు.