నిన్నటి వరకూ పలు రాష్ట్రాల్లో విధ్వంసాన్ని సృష్టించిన అగ్నిపథ్.. నేడు రాష్ట్రానికీ చేరుకుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆర్మీ అభ్యర్థులు తీవ్ర ఆందోళనలకు పాల్పడడంతో... పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. దీంతో ముందస్తు జాగ్రత్తగా పోలీసులు నాంపల్లి రైల్వే స్టేషన్‌ను మూసేశారు. ప్రయాణికులెవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే వరంగల్ నుంచి సికింద్రాబాద్, హైదరాబాద్ వైపు వచ్చే రైళ్లను వరంగల్ స్టేషన్లోనే నిలిపివేశారు. కాజీపేట, మహబూబాబాద్, తదితర స్టేషన్లలోనూ భద్రతను పెంచారు. ఈ నిరసనల్లో భాగంగా ఇప్పటికే ఆందోళనకారులు పలు రైళ్లను తగలబెట్టి, అద్దాలు పగులగొట్టి.... ప్రయాణికులను భయాందోళనలకు గురి చేశారు. దీంతో పరిస్థితిని అదుపు చేయలేని స్థితిలో ఉన్న పోలీసులు.. యువతపైకి టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పాటు, కాల్పులూ జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరో 8మందికి గాయాలైనట్టు సమాచారం.
6 రైళ్లు రద్దు, 2 దారి మళ్లింపు, 1 పాక్షికంగా రద్దు
అయితే ఆందోళనకారులు సృష్టించిన ఈ అలజడి నేపథ్యంలో 6 రైళ్లను రద్దు చేసిన అధికారులు..2 రైళ్లను దారి మళ్లించారు.1 రైలును పాక్షికంగా రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. వీటిలో ముఖ్యంగా హైదరాబాద్ టూ షాలిమార్, ఉమ్దా నగర్ టూ సికింద్రాబాద్, సికింద్రాబాద్ టూ ఉమ్దా నగర్, ఉమ్దా నగర్ టూ సికింద్రాబాద్, సికింద్రాబాద్ టూ ఉమ్దానగర్, ఉమ్దానగర్ టూ సికింద్రాబాద్ రైళ్లను రద్దు చేసి రద్దు చేసిన రైల్వే శాఖ.. సికింద్రాబాద్ టూ రేపల్లె రైలును పాక్షికంగా రద్దు చేసింది. షిరిడీ సాయి నగర్ టూ కాకినాడ పోర్టుకు వెళ్లే రైలును సనత్ నగర్, అమ్ముగూడ, చెర్లపల్లి మీదుగా దారి మళ్లించగా.. భువనేశ్వర్ టూ ముంబయి సీఎస్టీ వెళ్లాల్సిన రైలును చెర్లపల్లి, అమ్ముగూడ, సనత్ నగర్ మీదుగా వెళ్లేటట్టు ఏర్పాటు చేసినట్లు అధికారులు ప్రకటించారు.
