బ్లడ్ దొరుకుతలేదు..నెలకు 150 నుంచి 200 యూనిట్లు అవసరం

బ్లడ్ దొరుకుతలేదు..నెలకు 150 నుంచి 200 యూనిట్లు అవసరం
  • ప్రస్తుతం బ్లడ్ బ్యాంకులో ఉన్నవి 21 యూనిట్లే
  • 2 నెలలుగా మూలనపడ్డ బ్లడ్ ట్రాన్స్​పోర్ట్​ వెహికల్ 
  • గద్వాల గవర్నమెంట్​హాస్పిటల్​లో పేషెంట్ల ఇబ్బందులు

గద్వాల, వెలుగు: గద్వాల గవర్నమెంట్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంకులో రక్త నిల్వలు లేక పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఆస్పత్రిలో ప్రతీ నెల 150 నుంచి 200 యూనిట్ల బ్లడ్ అవసరమవుతుంది. కానీ ప్రస్తుతం బ్లడ్ బ్యాంకులో 21 యూనిట్లు మాత్రమే ఉన్నాయి. దవాఖానకు వచ్చే పేషెంట్లు, బాలింతలకు ఎమర్జెన్సీ టైంలో రక్తం దొరకని పరిస్థితి నెలకొంది.  

బ్లడ్​ కలెక్ట్​ చేసేందుకు డాక్టర్ ​సహా ఐదుగురు..

ప్రతీరోజు బ్లడ్ కలెక్ట్ చేసేందుకు ఎన్ హెచ్ఎం (నేషనల్ హెల్త్ మిషన్) కింద గవర్నమెంట్ హాస్పిటల్ లో వెహికల్ ఏర్పాటు చేశారు. ఒక డాక్టర్, ఒక పీఆర్వో, ఇద్దరు టెక్నీషియన్లు, డ్రైవర్​ను నియమించారు. వీళ్లు నిత్యం రక్తదాతల కోసం వెతకడం, రక్తం సేకరించి, బ్లడ్​బ్యాంకులో ఇవ్వాల్సి ఉంటుంది.

కానీ 2 నెలలుగా ఎక్కడా బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేయడం లేదు. అసలు వారు ఎక్కడ డ్యూటీ చేస్తున్నారో తెలియని పరిస్థితి ఉంది. బ్లడ్ కలెక్ట్ చేసేందుకు లక్షయలు ఖర్చు చేస్తున్నా కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోందని పలువురు అంటున్నారు.

బి–పాజిటివ్​ యూనిట్లు రెండే..

ఆస్పత్రిలోని బ్లడ్​ బ్యాంకులో బి–పాజిటివ్ బ్లడ్ యూనిట్లు రెండింటినే 2 నెలలుగా నిల్వ చూపిస్తూ వస్తున్నారు. రక్తం దొరక్కపోవడంతో పేషెంట్లు ప్రైవేట్ బ్లడ్ బ్యాంకుల్లో డబ్బులు పెట్టి కొనుక్కుంటూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు.

ప్లేట్ లెట్స్​కౌంటింగ్​మెషీన్ వాడుతలేరు

గద్వాల గవర్నమెంట్ హాస్పిటల్ లో ప్లేట్ లెట్స్​కౌంటింగ్​మెషీన్ ఉన్నా వాడటం లేదు. కమీషన్​కోసం ఆస్పత్రి డాక్టర్లు పేషెంట్లను ప్రైవేట్​బ్లడ్ బ్యాంకులకు పంపిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఏడాది క్రితమే ఈ దవాఖానలో  ప్లేట్ లెట్ కౌంటింగ్ మెషీన్ ఏర్పాటు చేయగా వినియోగానికి 3 నెలల క్రితం పర్మిషన్ వచ్చింది. అప్పటినుంచి ఇప్పటివరకు పట్టుమని 10 మందికి కూడా ప్లేట్​లెట్స్​ కౌంట్​చేయలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బయట ప్లేట్ లేట్స్​కౌంట్​చేయిస్తే రూ.15,500  ఖర్చవుతుంది. ప్రైవేట్ వ్యక్తులు పెద్ద ఎత్తున కమీషన్ ఇస్తుండడంతో హాస్పిటల్ లోని మెషీన్ ను వినియోగించడం లేదని, అలాగే టీ హబ్ లో చేయాల్సిన కొన్ని టెస్ట్ లను బయటకు రెఫర్​చేస్తున్నారని, కొందరు నర్సుల ద్వారా ప్రైవేట్​ల్యాబ్​లతో కుమ్మక్కై తతంగం నడిపస్తున్నారన్న చర్చ జరుగుతోంది.

బ్యాటరీ లేక వెహికల్ వాడట్లేదు

బ్లడ్ కలెక్షన్ వెహికల్ మూలనపడిన మాట వాస్తవమే. బ్యాటరీ లేకపోవడంతో వాడట్లేదు. రిపేర్ చేయిస్తున్నాం. బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అవసరాన్ని బట్టి ప్లేట్​లెట్ మెషీన్​వాడుతున్నాం. బయటకు రెఫర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.– ఇందిర, సూపరింటెండెంట్​, గద్వాల హాస్పిటల్