V6 News

ఏపీ సీఎం చంద్రబాబు అప్పుడలా ఇప్పుడిలా.. దక్షిణాదికి జరిగే అన్యాయంపై నోరు మెదపని వైనం

ఏపీ సీఎం చంద్రబాబు అప్పుడలా ఇప్పుడిలా.. దక్షిణాదికి జరిగే అన్యాయంపై నోరు మెదపని వైనం
  • ఏపీ నష్టపోకుండా ఎక్కువ మంది పిల్లల్ని కనాలని గతంలో పిలుపు
  • గతేడాది చెన్నై మీటింగ్​కు ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం డుమ్మా
  • చెన్నై వేదికగా కేంద్రానికి మిగతా రాష్ట్రాల సీఎంలు, వివిధ పార్టీ నేతల స్ట్రాంగ్​ వార్నింగ్​
  • తమిళనాడు, తెలంగాణ సీఎంల వ్యూహాలు ఫలించడం వల్లే కొంత దిగొచ్చిన కేంద్రం
  • జనాభా లెక్కలు పక్కనపెట్టి 50 శాతం ప్రోరేటాకు  గ్రీన్​సిగ్నల్​

హైదరాబాద్, వెలుగు: 
కేంద్రం చేపడుతున్న లోక్​సభ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరి చర్చనీయాంశంగా మారింది. గతంలో జనాభా ఆధారంగా డీలిమిటేషన్​ చేపట్టాలన్న ఎన్​డీఏ సర్కారు నిర్ణయాన్ని ఏనాడూ వ్యతిరేకించని బాబు అండ్ ​కో.. తీరా ఇప్పుడు తమ వల్లే కేంద్రం ప్రోరేటాకు ఒప్పుకుందనేలా కలరింగ్​ ఇచ్చుకుంటున్నారు. నిజానికి జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయంపై మిగిలిన సీఎంలు ఏడాది కాలంగా గొంతెత్తుతున్నా.. బాబు ఏనాడూ 
స్పందించలేదు. 

నిరుడు స్టాలిన్​ అధ్యక్షతన చెన్నై లో నిర్వహించిన మీటింగ్​కు సైతం ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం హాజరుకాలేదు. చెన్నై వేదికగా మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నేతలు కేంద్రానికి  స్ట్రాంగ్​ వార్నింగ్ ఇవ్వడం, ఆ తర్వాత తెలంగాణ, తమిళనాడు సీఎంలు పలు ప్రతిపాదనలతో వ్యూహాత్మకంగా వ్యవహరించడం వల్లే  కేంద్రం దిగివచ్చినట్లు స్పష్టమవుతున్నా, చివర్లో అదంతా తనవల్లేనని చెప్పుకునేందుకు బాబు తాపత్రయపడుతున్న తీరుపై విస్మయం 
వ్యక్తమవుతున్నది.

జనాభా ఆధారంగా డీలిమిటేషన్​ చేపడితే ఏపీకి నష్టం జరుగుతుందని, అందువల్ల ప్రతి జంటా ముగ్గురు పిల్లల్ని కనాలని అప్పట్లో అక్కడి ప్రజలకు బాబు పిలుపునిచ్చారు. అంటే జనాభా ప్రాతిపదికనే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. కానీ జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజనకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమని మిగిలిన దక్షిణాది సీఎంలు ఏడాదికాలంగా గొంతెత్తుతున్నారు.

 గతేడాది మార్చి 22న తమిళనాడు సీఎం స్టాలిన్​అధ్యక్షతన డీలిమిటేషన్​అంశంపై చెన్నైలో జరిగిన మీటింగ్​కు తెలంగాణ, కేరళ, పంజాబ్ సీఎంలు రేవంత్ రెడ్డి, పినరయి విజయన్, భగవంత్ సింగ్ మాన్, కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, బీఆర్ఎస్​, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ తదితర పార్టీల నేతలు హాజరై కేంద్రానికి  స్ట్రాంగ్​ వార్నింగ్​ఇచ్చారు. జనాభా ప్రాతిపదికన చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజనకు తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమని, 25 ఏండ్ల పాటు డీలిమిటేషన్  వాయిదావేయాలని డిమాండ్​చేస్తూ  తీర్మానాన్ని ఆమోదించారు. 

నిజానికి ఈ సమావేశం తర్వాతే కేంద్రంలోని బీజేపీ సర్కారు ‘జనాభా ప్రాతిపదికన పునర్విభజన’​పై పునరాలోచనలో పడింది. ఇది మరో ద్రవిడ ఉద్యమానికి దారి తీస్తుందేమోనని భయపడింది. ఆ తర్వాత తెలంగాణ, తమిళనాడు సీఎంల బెదిరింపులు, వ్యూహాలు ఫలించడం వల్లే ఈమాత్రమైనా దిగివచ్చిన కేంద్రం  ప్రోరేటా ప్రకారం అన్ని రాష్ట్రాల్లోనూ 50 శాతం చొప్పున సీట్ల పెంపునకు ఒప్పుకుందని, ఇది ముమ్మాటికీ రేవంత్, స్టాలిన్​విజయమేనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. 

  • ఏడాది కాలంగా ఏపీయేతర సీఎంల పోరాటం

కేంద్రంలో చక్రం తిప్పగలిగే స్థితిలో ఉన్న చంద్రబాబు.. డీలిమిటేషన్​పై మౌన ముద్ర దాలిస్తే, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళ సీఎంలు రేవంత్, స్టాలిన్, సిద్ధరామయ్య, విజయన్​ మాత్రం ఏడాది కాలంగా దక్షిణాది రాష్ట్రాల గొంతుక వినిపిస్తున్నారు. జనాభా ప్రతి పాదకన డీలిమిటేషన్​ చేపడితే, కేంద్రంలో సౌత్​స్టేట్స్​ ప్రాతినిధ్యం ఎలా తగ్గిపోతుందో గణాంకా లతో సహా వివరిస్తూ వచ్చారు. గతేడాది మార్చి 22న  ‘‘జాతీయ స్థాయి ప్రతిఘటన.. భారీ ఉద్య మం’’ తప్పదంటూ కేంద్రానికి స్ట్రాంగ్​వార్నింగ్​ఇచ్చారు. ఇక డీలిమిటేషన్​ బిల్లును పార్లమెంట్​లో ఆమోదించడానికి సరిగ్గా 24 గంటల ముందు స్టాలిన్ ఒక వీడియో మెసేజ్ రిలీజ్​ చేశారు. 

‘ఒక వేళ కేంద్రం జనాభా ఆధారంగా లోక్​సభ సీట్లను పెంచాలని చూస్తే మా కుటుంబాలన్నీ వీధు ల్లోకి వస్తాయి.. బ్లాక్ ఫ్లాగ్ ఉద్యమం చేస్తాం..  ఇది ఫైనల్ వార్నింగ్’  అంటూ హెచ్చరిక జారీ చేశారు. అంతకు 24 గంటల ముందు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైబ్రిడ్ మోడల్ ను తెరపైకి తెచ్చారు. అదనంగా పెంచబోయే సీట్లలో 50% ప్రో-రేటా ప్రకారం, మరో 50% సీట్లు జీఎస్​డీపీ ప్రకారం పెంచాలని డిమాండ్​ చేశారు. కేవలం జనాభా ప్రాతిపదికనే సీట్లను పెంచితే  అది‘‘దీర్ఘకాలిక విపత్తు’’ అంటూ కుండబద్దలు కొట్టారు. ఈమేరకు దక్షిణాది సీఎంలందరికీ ఆయన లేఖలు రాశారు. 

  • మిగతా సీఎంలు గొంతుచించుకుంటున్నా..

జనాభా ప్రాతిపదికన చేపట్టే డీలిమిటేషన్​కు వ్యతిరేకంగా మిగతా సీఎంలు గొంతుచించుకుంటున్నా, బాబు మాత్రం మౌనాన్నే ఆశ్రయించారు. ప్రతి జంటా ముగ్గురు పిల్లల్ని కనాలన్న చంద్రబాబు పిలుపుపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. కేంద్రం ఇచ్చిన పిలుపు మేరకు జనాభాను నియం త్రించి, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన సౌత్​స్టేట్స్.. దేశానికి ఆర్థిక దన్నుగా నిలుస్తున్నాయని, తీరా బాబు జనాభాను పెంచాలనుకోవడం ఆయన అవివేకానికి నిదర్శనమని, ఇది తిరోగమన చర్య తప్ప మరోటి కాదని పలువురు మండిపడ్డారు. 

ఈ క్రమంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్​షర్మిల చంద్రబాబు వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. మోదీ భయంతోనే చంద్రబాబు, పవన్​ కల్యాణ్​ డీలిమిటేషన్​ను వ్యతిరేకించకుండా దక్షిణాది ప్రయోజనాలను ఫణంగా పెట్టారని ఫైర్​అయ్యారు. వీరి చర్యల వల్ల డీలిమిటేషన్​పై పోరాటంలో ఏపీ ఒంటరిగా మిగిలిపోయిందని వాపోయారు. గత  బుధవారం బాబుకు 3 పేజీల బహిరంగ లేఖ రాశారు. డీలిమిటేషన్ బిల్లును బహిరంగంగా వ్యతిరేకించాలని, ఏపీకి చెందిన 25 లోక్‌‌‌‌సభ ,11 రాజ్యసభ ఎంపీలందరినీ ఏకం చేసి బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయించాలని డిమాండ్​చేశారు. ఈమేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాలని సూచించినా బాబు నుంచి గానీ, పవన్​ నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు. 

  • మౌనంగా లేనని చెప్పుకునేందుకు మీటింగ్​!​

కాగా, బుధవారం సాయంత్రం ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కలిసి అమరావతిలో ప్రత్యేకంగా సమావేశం కావడం,  కేంద్రమంత్రులు కిరణ్​ రిజిజు, అర్జున్​రామ్ మేఘ్వాల్, కిషన్​రెడ్డి, రామ్మోహన్​ నాయుడుతో ఫోన్లో మాట్లాడి డీలిమిటేషన్, ప్రోరేటా ప్రకారం సీట్లపెంపుపై అనుమానాలను నివృత్తి చేసుకున్నట్టు, పలు సూచనలు ఇచ్చినట్లు పత్రికా ప్రకటన విడుదల చేయడం గమనార్హం. 

అంటే ఈ విషయంలో తాను మౌనంగా లేనని, కేంద్రంపై ఒత్తిడి కొనసాగిస్తున్నానని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ సమావేశం నిర్వహించినట్లు చెప్తున్నారు. నిజానికి చంద్రబాబు డీలిమిటేషన్ కు ఏనాడూ ఒప్పుకో లేదని, లోక్​సభ సీట్ల పెంపుపై ఫ్రీజింగ్​ విధించాలనేది తమ నేత స్టాండ్​ అని మొదట్లో టీడీపీ నేతలు చెప్పారు. కానీ డీలిమిటేషన్​ తప్పదని కేంద్రం సంకేతాలు ఇవ్వడంతో తమ నేత ‘శాస్త్రీయ పెంపు’నకు ప్రయత్నిస్తున్నారంటూ మాటమార్చారు. తీరా పార్లమెంట్  సమావేశాలకు ముందు, ఇలాంటి మీటింగ్​నిర్వహించడాన్ని బట్టి చంద్రబాబు తీరు ‘ఏ ఎండకాగొడుగు పట్టినట్లుగా ఉంద’ ని పలువురు అభిప్రాయపడ్తున్నారు.