
బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం ఏపీ వైపు వేగంగా దూసుకొస్తోంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం ప్రస్తుతం గంటకు 17 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ తీరానికి సంపిస్తున్న కొద్దీ తీవ్ర ప్రభావం చూపుతోంది. కళింగపట్నానికి 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం.. బుధవారం ( అక్టోబర్ 1 ) అర్థరాత్రి గోపాల్ పూర్ ఒడిశా మధ్య తీరం దాటింది. ఈ ప్రభావంతో ఉత్తరాంధ్రలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖలో ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. చాలా చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి.
తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారిన క్రమంలో మూడో నంబర్ హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. విశాఖలో తీవ్రమైన ఈదురుగాలులకు చాలా చోట్ల చెట్లు నెలకొరగగా.. కరెంటు పోల్స్,భారీ హోర్డింగ్స్ కుప్పకూలాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
తీవ్ర వాయుగుండం ప్రభావంతో బుధవారం ( అక్టోబర్ 2 ) కోస్తా జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురవగా.. అక్కడక్కడా ఓ మోస్తరు వర్షపాతం నమోదయ్యిందని తెలిపింది వాతావరణ శాఖ. అనకాపల్లి జిల్లా మాడుగులలో 7.3 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదవ్వగా... గాదిరాయిలో 5.1, అరకులో 3.8, పలాసలో 3.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపింది వాతవరణ శాఖ.
రానున్న రెండు రోజుల పాటు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతేనే బయటికి వెళ్లాలని సూచించింది ఐఎండీ.