శివారు కాలనీల్లో సీవరేజ్ పనులు ఎక్కడికక్కడే పెండింగ్

శివారు కాలనీల్లో సీవరేజ్ పనులు ఎక్కడికక్కడే పెండింగ్
  • వాటర్​ బోర్డుకు అప్పగించాక అన్నీ పెండింగే
  • దాదాపుగా 66 డివిజన్లలోనూ ఇదే పరిస్థితి
  • అత్యవసరమైన చోట కూడా పనులు చేయట్లే
  • కౌన్సిల్ మీటింగులో కార్పొరేటర్లు ఆందోళన చేసినా స్పందించని అధికారులు

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ పరిధిలోని 66 శివారు డివిజన్లలో సీవరేజ్ పనులు జరగడం లేదు. గతేడాది అక్టోబర్ కి ముందు ఈ డివిజన్లలోని సివరేజీ బాధ్యతలను జీహెచ్ఎంసీనే నిర్వహించింది. ఆ తర్వాత వాటర్​బోర్డుకు అప్పగించింది. అప్పటి నుంచి ఈ ప్రాంతాల్లో ఎలాంటి పనులు చేయట్లేదు. చిన్న చిన్న పనులకు కూడా వాటర్​బోర్డు ఎండీ అనుమతి తీసుకోవాల్సి వస్తుండడంతో పనులు లేట్​అవుతున్నాయి. 5 నుంచి 10 మీటర్ల పైపులైన్ రిపేర్లను కూడా డివిజన్ స్థాయి అధికారులు చేయలేని పరిస్థితి ఉంది.

మ్యాన్ హోల్స్​ డ్యామేజీ అయ్యాయని ఫిర్యాదులు చేసిన15 రోజులకు కూడా రిపేర్లు చేయడంలేదని కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఆధీనంలో ఉన్నప్పుడు కనీసం కొన్ని అయినా జరిగేవని, ఇప్పుడు నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోందని అంటున్నారు. ఈ విషయంపై ఏదో ఒక నిర్ణయం తీసుకుని అత్యవసర పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో పెండింగ్ లో ఉన్నాయని, భారీ వర్షం కురిస్తే వందలాది కాలనీల్లో నీరు నిలిచే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడిన ప్రతిసారి ఆయా ప్రాంతాల్లో రోజుల తరబడి నీళ్లు ఉంటున్నాయని చెబుతున్నారు. 

3,600 కిలోమీటర్లకు 650 మందే

మైలార్ దేవ్ పల్లి, చంపాపేట, మన్సురాబాద్, మల్కాజిగిరి, రాజేంద్రనగర్, అత్తాపూర్, సులేమాన్ నగర్, శాస్త్రీపురం, ఐఎస్ సదన్ ఇలా శివారులోని 66 జీహెచ్ఎంసీ డివిజన్లలో మొత్తం 3,600 కిలోమీటర్ల మేరా సీవరేజ్​పైపులైన్ ఉంది. ఈ ప్రాంతాల్లో 3 లక్షల26 వేలకుపైగా మ్యాన్ హోల్స్ ఉన్నాయి. వీటి నిర్వహణకు 650 మంది కార్మికులు మాత్రమే ఉన్నారు. మ్యాన్​హోళ్ల నిర్వహణకు నెలకు రూ.12 కోట్ల చొప్పున జీహెచ్ఎంసీ వాటర్​బోర్డుకు చెల్లిస్తోంది. 24 ఎయిర్ టెక్ యంత్రాలు, 66 మినీ ఎయిర్ టెక్ యంత్రాలను అప్పగించింది. కానీ ఒక్కో డివిజన్​కు ఒక్కోటి కూడా లేదు. సెంట్రల్ సిటీలో వాటర్​బోర్డు వినియోగిస్తున్న యంత్రాలను శివారులో వాడట్లేదు. సమస్య ఎక్కువ అవడానికి ఇదో కారణం. ఉన్న మ్యాన్ హోళ్లలో 10 శాతం వరకు డ్యామేజ్ అయ్యాయి. అయినా కొత్తవి ఏర్పాటు చేయడం లేదు.  

రూ.లక్ష దాటితే ఎండీ పర్మిషన్​ మస్ట్

సీవరేజ్​ పనులకు రూ.లక్ష రూపాయల కంటే ఎక్కువ ఖర్చయ్యే వాటికి ఎండీ అనుమతి తీసుకోవాలనే నిబంధన ఉంది. ఆ పనుల ఫైల్​ని డీజీఎం నుంచి జీఎంకి, అక్కడి నుంచి డైరక్టర్​కు, అక్కడి నుంచి ఎండీ వద్దకు ఫైల్ వెళ్లేందుకు రోజులు పడుతుంది. పై నుంచి అప్రూవల్​వచ్చాకే టెండర్లు పిలిచి పనులు చేసేది. ఇదంతా జరగడానికి చాలా టైం పడుతుండడంతో పనులు పెండింగ్​లో పడుతున్నాయని పలువురు  అధికారులు చెబుతున్నారు.


సిబ్బంది కొరత కూడా..

66 డివిజన్లను జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందుగానే అప్పగించగా, జలమండలి వద్ద సరిపడా సిబ్బంది లేక అప్పట్లో సీవరేజ్​సమస్య తీవ్ర స్థాయికి చేరింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తుండటంతో తిరిగి జీహెచ్ఎంసీ తీసుకుంది. ఎన్నికలయ్యాక గతేడాది అక్టోబర్​లో తిరిగి మళ్లీ వాటర్​బోర్డుకు అప్పగించింది. జీహెచ్ఎంసీ నిర్వహించిన టైంలో సీవరేజ్ నిర్వహణను ఎస్ఎఫ్​ఏలు చూసుకునేవారు. అలా  ఒక్కో డివిజన్ లో దాదాపు 10 మంది ఎస్ఎఫ్ఎలు ఉండేవారు.

కానీ వాటర్​బోర్డు పరిధిలోకి వచ్చాక ఇద్దరు సూపర్ వైజర్లే చూడాల్సి వస్తోంది. అలాగే ఒక్కో డివిజన్ లో కార్మికులు 10 మందే ఉన్నారు. కానీ డివిజన్ లో దాదాపు 5వేలకుపైగా మ్యాన్ హోల్స్​ఉన్నాయి. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగులో అన్నిపార్టీల కార్పొరేటర్లు సీవరేజ్​ పనులపై అధికారులను నిదీశారు. ఏ ప్రశ్నకూ వాటర్​బోర్డు అధికారి సమాధానం ఇవ్వలేకపోయాడు.

డ్రైనేజీ వ్యవస్థ సక్కగా లేదు

మా ఏరియాలో సీవరేజ్ పనులు జరగకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నం. రోడ్లపై నీరు నిలుస్తోంది. కనీసం నడిచి వెళ్లేందుకు కూడా దారి ఉండడం లేదు. వర్షం పడిన కొన్నిరోజులపాటు ఇదే పరిస్థితి. డ్రైనేజీ వ్యవస్థ సక్కగ లేకనే ఈ అవస్థలు.  అధికారులు స్పందించి పనులు చేస్తే బాగుంటుంది. మ్యాన్ హోల్స్​మూతలు డ్యామేజ్​అయ్యాయి. కొత్తవి ఏర్పాటు చేయాలి.  - రవి, మన్సూరాబాద్
 

ఎన్నిసార్లు చెప్పిన చేస్తలే

వర్షాలు కురిస్తే రోడ్లపైకి నీరు చేరుతోందని, అవసరమైన చోట కొత్తగా డ్రైనేజీ పైపులైన్లు ఏర్పాటు చేయాలని వాటర్​బోర్డు అధికారులకు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాం. కానీ పట్టించుకోవడం లేదు. కనీసం మ్యాన్​హోల్స్ రిపేర్​ చేయాలని కోరి 20 రోజులు అవుతోంది. ఆ పనులు చేయలే. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నప్పుడు కనీసం కొన్ని పనులైనా జరిగేవి. జలమండలికి అప్పగించాక ఏ ఒక్క పనీ కావట్లేదు. సిబ్బంది వద్ద కావాల్సిన పనిముట్లు కూడా లేవంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలె. - శ్రావణ్, కార్పొరేటర్, మల్కాజిగిరి

అన్ని పనులు చేస్తున్నం
సీవరేజ్​కు సంబంధించిన అన్ని పనులు చేస్తున్నాం. అవసరమైన చోట ఎప్పటికప్పుడు అంచనా వేసి పూర్తి చేస్తున్నాం. ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే వెంటనే పరిష్కరిస్తున్నాం. కొత్తగా పైపులైన్లు కావాలంటే నిర్మిస్తున్నాం.  - చంద్రశేఖర్, వాటర్​బోర్డు జీఎం, రాజేంద్రనగర్ డివిజన్