సెక్స్​ రాకెట్ కేసు: నిందితుడి ఫోన్​లో 49 వేల మంది ఫొటోలు

సెక్స్​ రాకెట్ కేసు: నిందితుడి ఫోన్​లో 49 వేల మంది ఫొటోలు
  • నిందితుడి ఫోన్​లో 49 వేల మంది ఫొటోలు
  • సెక్స్​ రాకెట్ కేసులో బయటపడుతున్న నిజాలు
  • మరో ఐదుగురు నిందితుల కోసం పోలీసుల సెర్చింగ్
  • ఫోన్ డేటా ఆధారంగా కస్టమర్ల వివరాల సేకరణ

గచ్చిబౌలి, వెలుగు: ఇంటర్నేషనల్ స్థాయిలో జరుగుతున్న ఆన్​లైన్ సెక్స్ రాకెట్ ముఠాను పట్టుకున్న కేసులో విస్తుపోయే విషయాలు బయటపడ్తున్నాయి. ప్రధాన నిందితుడు అదీమ్ అలియాస్ అర్నవ్​(31) వెనుక భారీ నెట్​వర్క్​ ఉన్నట్లు సైబరాబాద్​ పోలీసులు గుర్తించారు. ఇతని సెల్​ఫోన్​లో 49,900 మంది యువతుల ఫొటోలు, వాళ్ల వివరాలు ఉన్నాయని చెప్పారు. 

ఈ యువతులందరినీ వ్యభిచారం కోసమే సంప్రదించేవాడని పోలీసులు బుధవారం మీడియాకు వెల్లడించారు. అదీమ్​తో పాటు మిగిలిన నిందితుల ఫోన్​లలోనూ వేలాది మంది యువతుల ఫోటోలను గుర్తించారు.ఇంత పెద్ద  సెక్స్​ రాకెట్​ నడుపుతున్న అదీమ్​ను, మరో 18 మంది నిందితులను పోలీసులు మంగళవారమే అరెస్ట్ చేశారు. వీరందరినీ తమ కస్టడీకి తీసుకుని, దీనివెనుక ఇంకెవరెవరు ఉన్నారనే విషయాలు తెలుసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. సెక్స్​ రాకెట్​ ముఠాలో మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు సైబరాబాద్​ సీపీ స్టీఫెన్​ రవీంద్ర తెలియజేశారు. వాళ్లను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నామని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల కమిషనర్లతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. ముఠా ఆర్గనైజర్లు వాడిన వెబ్​సైట్‌లను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు అరెస్ట్ చేసిన 17 మంది నిందితుల మొబైల్ ఫోన్​ డేటా ఆధారంగా విటుల వివరాలను కూడా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. 

4 ఏండ్లుగా పోలీసుల కండ్లుగప్పి.. 

ఈ కేసులో ప్రధాన నిందితుడు  అదీమ్​ 4 ఏండ్లుగా పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. 2019 నుంచి అడ్రస్​లు మారుస్తూ వస్తున్నాడు. ఏదైనా డెలివరీ వస్తే తాను అడ్రస్ చేంజ్​ అయ్యాను అంటూ పలానా ప్లేస్​కు రావాలని చెప్పి డెలివరీ తీసుకుంటాడు. హైదరాబాద్​ కేంద్రంగా సెక్స్​ రాకెట్ నడుపుతున్న అదీమ్​పై హైదరాబాద్​, సైబరాబాద్​ లిమిట్స్​లోని 5 పోలీస్​ స్టేషన్​లలో 10 కేసులున్నాయి. రెండు నెలల నుంచి సైబరాబాద్​ పరిధిలోని వ్యభిచార గృహాలపై దాడులు చేస్తున్న పోలీసులు నిర్వాహకుల వివరాలపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే అదీమ్​ను అరెస్ట్ చేశారు.