ఢిల్లీ మెట్రోలో లైంగిక వేధింపులు

ఢిల్లీ మెట్రోలో లైంగిక వేధింపులు

ఢిల్లీ మెట్రోలో మహిళలపై ఆకతాయిలు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. 2016 నుంచి ఆ కేసులు 43 శాతం పెరిగాయి. సెంట్రల్​ ఇండస్ట్రియల్​ సెక్యూరిటీ ఫోర్స్​ (సీఐఎస్​ఎఫ్​) డేటా చెబుతున్న చేదు నిజం ఇది. ఢిల్లీ మెట్రో భద్రతా బాధ్యతలను చూస్తున్న సీఐఎస్​ఎఫ్​కు ఈ ఏడాది ఆరు నెలల్లోనే లైంగిక వేధింపులపై 110 ఫిర్యాదులు అందాయి.  గత మూడేళ్లలో ఏడాది పాటు వచ్చిన కేసులతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. 2016లో 77, 2017లో 87, 2018లో 86 చొప్పున లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. ఎక్కువ కేసులు రిపోర్ట్​ అవుతున్నది జనరల్​ బోగీల నుంచేనని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి చెప్పారు. ఫిర్యాదుల్లో ఎక్కువగా అసభ్యకరంగా తాకడం, మీదపడి నెట్టేయడం, మీదిమీదికి దూసుకురావడం వంటివే ఎక్కువున్నాయన్నారు. అవి కూడా పీక్​ టైం అయిన ఉదయం 8 నుంచి 11 గంటలు, సాయంత్రం 5 నుంచి 8 గంటల మధ్యే జరుగుతున్నాయని ఆ అధికారి చెప్పారు. బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయడం వల్లే ఈ ఏడాది కేసులు ఎక్కువగా ఉన్నాయని సీఐఎస్​ఎఫ్​ అసిస్టెంట్​ ఇన్​స్పెక్టర్​ జనరల్​ హేమేంద్ర సింగ్​ వివరించారు. వచ్చిన ఫిర్యాదుల్లో 18 ఎఫ్​ఐఆర్​లు నమోదు చేశామని, నిందితులందరినీ అరెస్ట్​ చేశామని ఢిల్లీ మెట్రో రైల్​ డిప్యూటీ కమిషనర్​ ఆఫ్​ పోలీస్​ మహ్మద్​ అలీ చెప్పారు.  అన్ని సందర్భాల్లోనూ కేసులు నమోదు చేయట్లేదని, స్పాట్​లో వాళ్లకు కౌన్సిలింగ్​ ఇచ్చి బుద్ధి చెప్పి పంపిస్తున్నామని హేమేంద్ర సింగ్​ తెలిపారు. ఢిల్లీ మెట్రోలో రోజూ సగటున  27 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.