యువతి వస్త్రధారణపై  కేరళ కోర్టు సంచలన వ్యాఖ్యలు

యువతి వస్త్రధారణపై  కేరళ కోర్టు సంచలన వ్యాఖ్యలు

కోజికోడ్ : మహిళ వస్త్రధారణ విషయంలో కేరళ కోర్టు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మహిళలు లైంగికంగా రెచ్చగొట్టే దుస్తులు ధరించినప్పుడు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 354 A ప్రకారం లైంగిక వేధింపుల ఫిర్యాదులు చెల్లవని కోజికోడ్ కోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు  లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న కేరళకు చెందిన సామాజిక కార్యకర్త సివిక్ చంద్రన్ (74) కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 

రెండేళ్ల క్రితం తనను లైంగికంగా  వేధించాడంటూ ఓ యువతి సివిక్ చంద్రన్పై ఈ ఏడాది ఏప్రిల్లో కోయిలాండి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. 2020 ఫిబ్రవరి 8న చంద్రన్ తనను నంది బీచ్లో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించినట్లు అందులో పేర్కొంది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ సెక్షన్ 354 ఏ, 341, 354 కింద ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. నిందితుని అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు.  

యువతి కంప్లైంట్ నేపథ్యంలో సివిక్ చంద్రన్ ముందస్తు బెయిల్ కోసం కోజికోడ్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. ఉద్దేశపూర్వకంగా తనను కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించాడు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన కోర్టు ప్రిన్సిపల్ జడ్జి జస్టిస్ ఎస్. కృష్ణ కుమార్ యువతి చేసిన ఆరోపణలు నమ్మశక్యంగాలేవని అభిప్రాయపడ్డారు. చంద్రన్ బెయిల్ దరఖాస్తుతో పాటు అందజేసిన ఫొటోలను పరిశీలించిన న్యాయమూర్తి దివ్యాంగుడైన 74ఏళ్ల సివిక్ చంద్రన్ యువతిని ఒడిలోకి లాక్కున్నాడనే ఆరోపణలు నమ్మలేమని అన్నారు. సాక్షాధారాలను బట్టి యువతి డ్రెస్సు రెచ్చగొట్టేలా ఉందని రుజువైనందున సెక్షన్ 354 ఏ ప్రకారం ఆమె ఫిర్యాదు నిలబడదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. లైంగికంగా వేధించారనడానికి ఆధారాలు లేనందున ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

కోజికోడ్ కోర్టు ఉత్తర్వులపై కేరళ మహిళా కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. న్యాయస్థానం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని కమిషన్ ఛైర్ పర్సన్ సతీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచారం వంది కేసులపై ఇది తప్పుడు ప్రభావం చుపుతుందని అభిప్రాయపడ్డారు.