విద్యారంగ సమస్యల పరిష్కరించాలని అసెంబ్లీ ముట్టడికి యత్నం..SFI,AISF నేతల అరెస్ట్

విద్యారంగ సమస్యల పరిష్కరించాలని అసెంబ్లీ ముట్టడికి యత్నం..SFI,AISF నేతల అరెస్ట్

బషీర్​బాగ్, వెలుగు: రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, బడ్జెట్​లో విద్యకు 30 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వేర్వేరుగా అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ఎన్నికల మేనిఫెస్టోలో 15 శాతం నిధులు ఇస్తామని హామీ ఇచ్చి, బడ్జెట్​లో కేవలం 8 శాతం మాత్రమే కేటాయించడం విద్యారంగాన్ని నిర్వీర్యం చేయడమేనని నేతలు మండిపడ్డారు. పెండింగ్​లో ఉన్న రూ. 9,500 కోట్ల ఫీజు రీయింబర్స్​మెంట్, స్కాలర్​షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. అలాగే విద్య భరోసా కార్డులు, ఎలక్ట్రిక్ స్కూటీలు, ల్యాప్​టాప్​ల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరసనగా అసెంబ్లీ వైపు వెళ్తున్న విద్యార్థి నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.