
స్టూడెంట్ యూనియన్లకు ఎన్నికలు నిర్వహించాలి
హైదరాబాద్, వెలుగు : దేశంలోని యూనివర్సిటీలతో పాటు అన్ని విద్యాసంస్థల్లో స్టూడెంట్ యూనియన్లకు ఎలక్షన్లు నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ గర్ల్స్ కన్వీనర్ దీప్సితా ధర్, నేషనల్ వైస్ ప్రెసిడెంట్స్ నితీశ్నారాయణ్, దీనిత్ డెంటా డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ 17వ జాతీయ మహాసభలు ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో బుధవారం రెండోరోజు కొనసాగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్టూడెంట్యూనియన్ల ఎన్నికల కోసం కేంద్రానికి వివిధ కమిటీలు సూచిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికలు లేకపోతే కాలేజీల్లోని సమస్యలు బయటికి రావన్నారు. మెడికల్, ఇంజినీరింగ్ సీట్ల భర్తీ కోసం తీసుకొచ్చిన నీట్, జేఈఈ, సీయూఈటీల కారణంగా చాలా మంది పేద విద్యార్థులకు సీట్లు దక్కడం లేదని, అందుకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ విధానానికి తాము పూర్తిగా వ్యతిరేకమని చెప్పారు.
విద్య ప్రైవేటీకరణ చాలా ప్రమాదం
విద్యారంగంలో ఫాసిస్ట్, మతతత్వ విధానాలను అమలు చేసేందుకు జాతీయ విద్యావిధానాన్ని తీసుకొచ్చారని ఎస్ఎఫ్ఐ మాజీ ప్రెసిడెంట్, కేరళ మాజీ మంత్రి ఎంఏ బేబీ అన్నారు. విద్యా కాషాయీకరణ, ప్రైవేటీకరణ చాలా ప్రమాదకరమని, దీనికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు. ఎస్ఎఫ్ఐ మాజీ ప్రెసిడెంట్ వై.వెంకటేశ్వర్రావు, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి, నాగరాజు, డీవైఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి హింమాంగ రాజ్ భట్టాచార్య, సీఐటీయూ జాతీయ కార్యదర్శి కేఎన్ ఉమేశ్, ఎన్పీడీఆర్డీ ప్రధాన కార్యదర్శి మురళీధర్, ఐద్వా జాతీయ నేత సుకన్య, ఏఐఏడబ్ల్యూయూ జాతీయ కార్యదర్శి విక్రమ్ సింగ్ తదితరులు మాట్లాడారు.
ఓయూ ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు ఆంజనేయులు,ఉపాధ్యక్షుడు సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మహాసభల్లో భాగంగా విజ్ఞాన దర్శిని వ్యవస్థపక అధ్యక్షుడు రమేశ్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎల్ మూర్తి, సైంటిఫిక్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట బుధవారం రాత్రి మూఢనమ్మకాలు– విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో ఓయూ ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు ఆంజనేయులు,ఉపాధ్యక్షుడు సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.