దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ: జస్టిస్ చంద్రు

దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ: జస్టిస్ చంద్రు
  • ఓయూలో ప్రారంభమైన ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభలు

 

హైదరాబాద్/ఓయూ, వెలుగు: దేశంలో ఎమర్జెన్సీ సమయంలోని పరిస్థితులు కనిపిస్తున్నాయని, ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, జైల్లో వేస్తున్నారని జస్టిస్ చంద్రు విమర్శించారు. ఇష్టానుసా
రంగా పద్మ​అవార్డులను ధారాదత్తం చేస్తున్నారని, అద్వానీకి భారతరత్న ఇచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదని అన్నారు. ఆర్ఎస్ఎస్ విధానాలను పార్లమెంట్‌లో కూర్చొని అమలుచేస్తున్నారని ఆరోపించారు. భగవద్గీత చదివితే ఫిజిక్స్ బాగా వస్తుందని గతంలో ఓ గవర్నర్ అన్నారని చెప్పారు.

దేశం ఒక్కరి నియంత్రణలో నడుస్తున్నదని, ఎవ్వరు వ్యతిరేకించినా వారిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని  ఆందోళన వ్యక్తం చేశారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జాతీయ 17వ మహాసభలు మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభ సూచికగా ఎస్ఎఫ్ఐ ఆలిండియా ప్రెసిడెంట్ వీపీ సాను.. సంఘం జెండాను ఆవిష్కరించారు. ఇటీవల కాలంలో మరణించిన విద్యార్థి అమరవీరులకు, ఇతరులకు నివాళి అర్పించారు. మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి.. హైదరాబాద్ చరిత్రను సభలో వివరించారు. తర్వాత ప్రతినిధుల సభలో జస్టిస్ చంద్రు ప్రారంభ ఉపన్యాసం చేశారు. స్టూడెంట్‌గా ఉన్నప్పుడు ఎస్ఎఫ్ఐలో పనిచేశానని, అప్పట్లో ప్రతి ఒక్కరికీ విద్య అనే నినాదంతో ఉద్యమాలు చేశామని గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్, ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు.