దేశమంతా ఒకే పరీక్షా విధానానికి వ్యతిరేకం : ఎస్ఎఫ్ఐ

దేశమంతా ఒకే పరీక్షా విధానానికి వ్యతిరేకం : ఎస్ఎఫ్ఐ

ముగిసిన ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభలు

విద్యా రంగ పరిరక్షణకు ఐక్య ఉద్యమాలు చేయాలని ఎస్ఎఫ్ఐ జాతీయ సహాయ కార్యదర్శి నితీష్ నారాయణ పిలుపునిచ్చారు. యూనివర్సిటీల్లో ప్రగతిశీల సంస్కృతి పెరగాలన్నారు. ఉస్మానియా యూనివర్శిటీ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభలు ముగిశాయి. అనంతరం నితీష్ నారాయణ మాట్లాడారు. నూతన జాతీయ విద్యా విధానానికి ప్రత్యామ్నాయ విద్యా విధానం ముసాయిదాపై మహాసభల్లో చర్చినట్లు తెలిపారు. విద్యారంగ బాధ్యులందరితో దీనిపై చర్చించి.. అన్ని రాష్ట్రాలకు సంబంధించి కేంద్రానికి ఓ నివేదిక ఇస్తామని తెలిపారు.

ప్రతిభకు భాషను ప్రాతిపదికగా తీసుకోరాదని, దేశమంతా ఒకే పరీక్షా విధానానికి తాము వ్యతిరేకమని నితీష్ నారాయణ స్పష్టం చేశారు. వృత్తి విద్యా కోర్సుల బోధన కూడా మాతృ భాషలో జరగాలన్నారు. కరోనా సమయంలో విద్యార్థుల్లో డ్రగ్ సంస్కృతి బాగా పెరిగిందని, ఇది విద్యాలయాల్లో ప్రధాన సమస్యగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ  విద్యాసంస్థల్లో ప్రజాస్వామ్య వాతావరణం లేదని, విద్యార్థులు ద్వితీయ శ్రేణి పౌరులు కాదని నితీష్ హెచ్చరించారు. దేశంలో ఉన్నత విద్యా శాతం చాలా తక్కువగా నమోదవుతోందని.. గిరిజన ప్రాంతాల్లో పాఠశాలల సంఖ్య చాలా తక్కువగా ఉందన్నారు. అక్కడ ఇంటర్ నెట్ సౌకర్యం కూడా లేదన్నారు. వికలాంగ విద్యార్థుల పక్షాన పోరాడతామని చెప్పారు.

మహాసభల్లో 23 రాష్ట్రాలకు చెందిన 697 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. విద్యారంగానికి సంబంధించిన 35 తీర్మానాలను సభ ఆమోదించింది. డేలిగెట్లల్లో సిద్దిపేటకు చెందిన 16 ఏళ్ల విద్యార్ధిని హారిక పిన్న వయస్కురాలుగా నిలిచారు. ఈ మహాసభలో ఎస్ఎఫ్ఐ తెలంగాణ అధ్యక్ష, కార్యదర్శులు మూర్తి, నాగరాజు, ఆహ్వాన సంఘం కోశాధికారి జావేద్, ప్రతినిధులు షేజిన, నిలంజన్ దత్తలు పాల్గొన్నారు.