రాజగోపాల్ రెడ్డికి షబ్బీర్ అలీ స్ట్రాంగ్ కౌంటర్ 

రాజగోపాల్ రెడ్డికి షబ్బీర్ అలీ స్ట్రాంగ్ కౌంటర్ 

కోమటిరెడ్డి రాజగోపాల్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి షబ్బీర్ అలీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. స్వార్థ ప్రయోజనాల కోసమే ఆయన పార్టీ మారుతున్నారని ఆరోపించారు. తనకు పిసిసి ఇవ్వాలని అడిగారని..అన్నయ్య కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆ పదవి ఇవ్వొద్దని తనతో చెప్పారని అన్నారు. పీసీసీ చీఫ్ పదవి రేవంత్ రెడ్డికి లేకుంటే తనకే ఇవ్వాలని రాజగోపాల్ రెడ్డి అడిగారని తెలిపారు. తన ఇంటికి వచ్చిన అతను ఈ విషయంపై తనను ప్రపోజల్ పెట్టాలని అడిగారని..అందుకు తానే ప్రత్యక్ష సాక్షిని అన్నారు.కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ అమిత్ షాను చాలా సార్లు కలిశానని ఆ విషయాన్ని తనకు ఆయనే చెప్పారన్నారు.

కాంట్రాక్టర్ గా ఉన్న రాజగోపాల్ రెడ్డికి డిఫాల్టర్ గా కోట్ల అప్పులున్నాయన్నారు. వాటి కోసమే రాజగోపాల్ రెడ్డి అమిత్ షాను కలిశారని తెలిపారు. మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఏరోజైనా నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అక్కడికి వెళ్లావా అని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. ఇన్నాళ్లకు మునుగోడు అభివృద్ధి గుర్తుకు వచ్చిందా అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీని, పీసీసీ చీఫ్ ను విమర్శించే స్థాయి రాజగోపాల్ కు లేదన్నారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అతనికి తగిన బుద్ధి చెబుతారన్నారు.