
- కేసీఆర్ కు స్పీకర్ గులాంగిరీ చేస్తున్నారు
- మమ్మల్ని ఎందుకు కలవలేదు
- ఆనాడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరితే వారి సభ్యత్వాన్ని స్పీకర్ రద్దు చేశారు
- బై ఎలక్షన్స్ వచ్చాయి
- ఈ సంగతి మరిచారా..
- షబ్బీర్ ఆలీ సూటి ప్రశ్నలు
ముఖ్యమంత్రి కేసీఆర్ కు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గులాంగిరీ చేస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ షబ్బీర్ ఆలీ. 12 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలతో భేటీ అయిన స్పీకర్… తమకు ఎందుకు అందుబాటులోకి రాలేదని ప్రశ్నించారు. నిబంధనలు పాటించకుండా సీఎల్పీని విలీనం చేసారని అన్నారు. రాజ్యాంగబద్దమైన అత్యుత్తమ పదవిలో ఉన్న గవర్నర్, స్పీకర్ ఇద్దరు రాజ్యంగ నిబంధనలను పట్టించుకోకపోతే ఎలా అని అన్నారు.
“ఈ 12 మంది ఎమ్మెల్యేలు ఒక్కో తేదీన కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. మొదట కొంతమంది టీఆర్ఎస్ లో చేరినపుడే వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్ కు ఫిర్యాదు చేశాం. ఐనా పట్టించుకోలేదు. అసలు మేము ఇచ్చిన ఫిర్యాదులనే స్పీకర్ పట్టించుకోవట్లేదు” అన్నారు షబ్బీర్ ఆలీ.
వైఎస్ హయాంలో కాంగ్రెస్ ఫిరాయింపులను ప్రోత్సహించలేదా అంటూ టీఆర్ఎస్ ఎదురు దాడి చేస్తోందని అన్నారు షబ్బీర్ ఆలీ. అప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని అప్పటి స్పీకర్ రద్దు చేస్తే బై ఎలక్షన్స్ వచ్చాయి… అది మర్చిపోయారా అని ప్రశ్నించారాయన.
“వ్యక్తులు శాశ్వతం కాదు. వ్యవస్థ ముఖ్యం. ఆ వ్యవస్థ లను నాశనం చేయకండి. భవిష్యత్ లో మీకే ప్రమాదం. ఆపరేషన్ ఆకర్ష్ ను TRS మార్చిలో స్టార్ట్ చేసింది. నిన్న ముగించింది. ఇలాంటి రాచరిక పాలన కావాలో… ప్రజాస్వామ్య పాలన కావాలో ప్రజలే నిర్ణయిస్తారు. న్యాయం కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్తాం. అక్కడ కూడా న్యాయం జరగకపోతే ప్రజా కోర్ట్ కు పోతాం” అని అన్నారు షబ్బీర్ ఆలీ.