షాద్ నగర్, వెలుగు: దళిత యువకుడు రాజశేఖర్ కిడ్నాప్, హత్య కేసులో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పోలీసులు పురోగతి సాధించారు. ఎనిమిది మందిని హంతకులుగా గుర్తించారు. సోమవారం ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా షాద్ నగర్ ఏసీపీ ఎస్.లక్ష్మీనారాయణ, సీఐ విజయ్ కుమార్ వివరాలు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్.. భవాని అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వేర్వేరు కులాలు కావడంతో భవాని తండ్రి కాగుల వెంకటయ్య యువకుడి కుటుంబంపై పగ పెంచుకున్నాడు.
ముఖ్యంగా ఆ ప్రేమ వివాహానికి చంద్రశేఖర్ సోదరుడు రాజశేఖర్ సహకరించాడని భావించి అతడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 12న వెంకటయ్య తన వెంట కొందరిని తీసుకెళ్లి రాజశేఖర్‌ను కిడ్నాప్ చేశారు. ఎనిమింది మంది కలిసి ఇన్నోవా కారులో ఎక్కించుకొని అన్నారం జంక్షన్ వైపు వెళ్లిపోయారు. కారులోనే రాజశేఖర్ కాళ్లు, చేతులను తాడుతో కట్టేసి గొంతు కోసి చంపేశారు. అదే కారులో డెడ్‌బాడీని రామేశ్వరం వైపు వెళ్లి నవాబుపేట అటవీ ప్రాంతంలో పడేశారు. తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను డెడ్‌బాడీపై పోసి తగులపెట్టారు.
హంతకులు వీరే..
ఎర్ర రాజశేఖర్ ను హత్య చేసిన వారిలో ఎల్లంపల్లి గ్రామానికి చెందిన కాగుల వెంకటయ్య, పత్తి శీను, వికారాబాద్ జిల్లా పూడూరు గ్రామానికి చెందిన వడ్డే నర్సింలు, బాలనగర్ మండలం గౌతాపూర్ గ్రామానికి చెందిన గణేశ్, మొయినాబాద్ మండలం నజీబ్ నగర్ గ్రామానికి చెందిన సోమ సురేశ్ అలియాస్ సోమచంద్ కుమార్, రంగంపల్లి గ్రామానికి చెందిన బిజ్జు రాఘవేందర్, ఆవుల శ్రీకాంత్, కానుగుల రాములు ఉన్నారు. వీరిలో ఏడుగురు అరెస్ట్ కాగా, గణేశ్పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరి వద్ద రెండు బైకులు, 2 కార్లు, రూ.6,500 , ఒక సెల్ ఫోన్, ఇన్నోవా కారు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల నిర్లక్ష్యమే హత్యకు కారణం: జాన్ వెస్లీ
రాజశేఖర్ హత్యలో పోలీసుల నిర్లక్ష్యం, ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపించిందని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ ఆరోపించారు. ఫరూక్ నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామంలో ఎర్ర రాజశేఖర్ కుటుంబాన్ని సోమవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజశేఖర్‌ను రాత్రి కిడ్నాప్ చేయగానే అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిందని, అయినా పోలీసులు నిర్లక్ష్యం చేశారని అన్నారు. తమ్ముడి ప్రేమకు సంబంధించి రాజశేఖర్‌ను పోలీసులు సైతం వేధించారన్నారు.
రాష్ట్రంలో కుల హత్యలు రోజురోజుకు పెరుగుతున్నా అరికట్టడంలో ప్రభుత్వ విఫలమవుతోందన్నారు. కులాంతర వివాహాల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాజశేఖర్ కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. సీపీఎం రాష్ట్ర నాయకులు తీగల సాగర్, స్కైలాబ్ బాబు, జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, నరసింహ, ఎన్.రాజు, శ్రీనునాయక్ ఉన్నారు.
